మధిర, మార్చి 17 : ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం, ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తానని ఖమ్మం-నల్లగొండ-వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం మధిర పట్టణంలోని టీవీఎం పాఠశాల ఆవరణలో పీఆర్టీయూ మధిర మండల శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ.. తన గెలుపు ఉపాధ్యాయ ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు. ఈ ఎన్నికలో రాజకీయ, కార్పోరేట్ శక్తులను పక్కనపెట్టి ఉపాధ్యాయుడిగా ఉన్న తనని మండలికి పంపిచ్చారన్నారు. ఏ నమ్మకంతో అయితే తనను గెలిపించారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు.
త్వరలోనే సీపీఎస్ రద్దు, ఉపాధ్యాయ పెండింగ్ బిల్లులు, పెండింగ్ డీఏలు, పీఆర్సీ, గురుకుల ఉపాధ్యాయ సమస్యలు, కేజీబీవీ సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తన గెలుపునకు కృషి చేసిన ప్రతి పీఆర్టీయూ కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పీఆర్టీయూ మధిర మండల శాఖ ఆధ్వర్యంలో శ్రీపాల్ రెడ్డిని శాలువా, పూలమలతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులగం దామోదర్ రెడ్డి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్సులు యలమద్ది వెంకటేశ్వర్లు, ఆర్.రంగారావు, జిల్లా మాజీ అధ్యక్షుడు మోత్కూరు మధు, మండల విద్యాశాఖాధికారి వై.ప్రభాకర్, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు ఆర్.బ్రహ్మారెడ్డి, రాష్ట్ర బాధ్యులు పుట్లూరి వెంకట్రెడ్డి, డి.వెంకటేశ్వరరావు, ఎస్కే.మదార్, టి.కృష్ణారెడ్డి, మధిర మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిలుకూరి సత్యనారాయణరెడ్డి, పోలె సుధాకర్, జిల్లా బాధ్యులు సీహెచ్.వి. రవి కుమార్, కొమ్ము.శ్రీనివాసరావు పాల్గొన్నారు.