సారపాక, డిసెంబర్ 28: గురుకులాల్లో విద్యార్థులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు కృషిచేస్తున్నామని ఎస్సీ, ఎస్టీ గురుకులాల ప్రిన్సిపల్ సెక్రటరీ రోనాల్డ్‌రోస్ అన్నారు. భద్రాచలంలో కొనసాగుతున్న మణుగూరు గురుకుల డిగ్రీ కళాశాలను ఐటీడీఏ పీవో పోట్రు గౌతమ్‌తో కలిసి బుధవారం సాయంత్రం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కళాశాలలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులూ కలుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. విద్యార్థులకు నోటు పుస్తకాలు సరఫరా చేయడంతోపాటు వారికి అవసరమైన కంప్యూటర్, ల్యాబ్, ఇతర వస్తువులు అందిస్తామన్నారు. విద్యార్థులు ఒత్తిడిని తట్టుకుని క్రమశిక్షణతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు.
అనంతరం వారు కళాశాల విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందించాలని కళాశాల బాధ్యులకు సూచించారు. అనంతరం కళాశాలలో కంప్యూటర్ గది, ప్రయోగశాలను పరిశీలించి పిల్లలందరూ కంప్యూటర్ సంబంధిత సబ్జెక్టుల్లో అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఇందుకు అధ్యాపకులు సహకరించి విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించాలని ఆదేశించారు. గిరిజన గురుకులాల ఆర్సీవో డేవిడ్‌రాజ్, ప్రిన్సిపాల్ అరుణకుమారి పాల్గొన్నారు.