ఖమ్మం ఎడ్యుకేషన్, సెప్టెంబర్ 30: ఉద్యోగాలు వచ్చాయన్న ఆనందం వారిలో లేనే లేదు.. కొలువులో చేరాలా.. వద్దా అనే మీమాంసలో ఉన్నారు.. సర్కార్ కొలువే లక్ష్యంగా చదివి 2008 డీఎస్సీలో ఎంపికై ఉద్యోగం దక్కించుకోలేకపోయిన అభ్యర్థులు అనేక పోరాటాలు చేస్తూ వస్తున్నారు. ఈ తరుణంలో గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో డీఎస్సీ 2008 అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇప్పుడు మాటమార్చి కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకుంటామని నిబంధనలు పెట్టడంతో వారి ఆశలు ఆవిరైపోయాయి. ఆలస్యమైనప్పటికీ ప్రభుత్వ ఉద్యోగం దక్కుతుందన్న ఆనందం వారికి లేకుండాపోయింది. పాత డీఈవో కార్యాలయం వేదికగా సోమవారం నిర్వహించిన సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియకు అభ్యర్థులు అంతంతమాత్రం హాజరుకావడమే ఇందుకు నిదర్శనం.
డీఎస్సీ 2008లో ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగాలిస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రకటన పట్ల అభ్యర్థులు ఆసక్తి చూపలేదు. నిరుత్సాహపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నదని, చెప్పిందొకటి.. చేసిందొకటి అంటూ డీఎస్సీ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంట్రాక్ట్ పద్ధతిలో ఎస్జీటీ(సెకండరీ గ్రేడ్ టీచర్)గా నియమిస్తామని పేర్కొనడంతో ఆశలు సన్నగిల్లి ఆందోళన మొదలైంది.
మైదాన ప్రాంతం, ఏజెన్సీ ప్రాంతాల వారీగా ధ్రువపత్రాల పరిశీలనకు అభ్యర్థులను రావాలని సూచించినా 25శాతం మంది మాత్రమే హాజరయ్యారంటే ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పట్ల ఉన్న వ్యతిరేకత అర్థమవుతున్నది. చాలామంది డీఎస్సీ 2008 ఉద్యోగం కంటే ప్రస్తుతం తాము చేస్తున్న ఉద్యోగాలే ఉత్తమం అనే పరిస్థితి ఉంది. ఇప్పటివరకు వారికి ఇచ్చే జీతభత్యాలకు సంబంధించిన పూర్తి నిబంధనలు సైతం ప్రకటించకపోవడం కూడా అభ్యర్థులు ఆసక్తి చూపకపోవడానికి కారణం.
విద్యాఖాధికారులు ఐదుగురు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులతో ఐదు టీమ్లుగా ఏర్పాటు చేసి డీఎస్సీ 2008 సర్టిఫికెట్ల పరిశీలన చేశారు. అత్యధిక మంది అభ్యర్థులు వస్తారనే ఆలోచనతో ఉదయం 9:30 గంటలకే పాత డీఈవో కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఏజెన్సీ ప్రాంత అభ్యర్థుల కోసం మూడు టీమ్లు, మైదానప్రాంత వారికి రెండు టీమ్లు కేటాయించారు. సమయం మధ్యాహ్నం 12గంటలవుతున్నా ఏజెన్సీ ప్రాంత అభ్యర్థుల కోసం ఎదురుచూడటం తప్ప సర్టిఫికెట్ల పరిశీలన జరగలేదు. మైదాన ప్రాంతంలో 128 మందికి 71 మంది హాజరుకాగా, ఏజెన్సీ ప్రాంతంలో 215మందికి 18 మంది మాత్రమే హాజరయ్యారు. డీఈవో సోమశేఖరశర్మ, సూపరింటెండెంట్ శ్రీధర్ ప్రక్రియను పర్యవేక్షించారు. అభ్యర్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
చాలా సంవత్సరాల నుంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నాం. అప్పటి డీఎస్సీలో నష్టపోయాం, ఇన్ని సంవత్సరాల తర్వాత అయినా రెగ్యులర్ పోస్టు ఇస్తే బాగుండేది. ఉద్యోగం పొందేందుకు చాలా పోరాటాలు చేశాం. ఇప్పుడు కాంట్రాక్ట్ పద్ధతిన ఇస్తుండడం చాలా బాధాకరం.
-అభిలాశ్, డీఎస్సీ 2008 అభ్యర్థి
డీఎస్సీ 2008లో ఉద్యోగం రాకపోవడం వల్ల సర్వీస్ నష్టపోయాం. 16 సంవత్సరాల తర్వాత ఇస్తున్న ఉద్యోగమైనా కాంట్రాక్ట్ కాకుండా రెగ్యులర్గా ఇస్తే చాలా సంతోషంగా ఉండేవాళ్లం. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం చాలా బాధగా ఉంది. ఇన్నేళ్లు ఎదురుచూసినా ఫలితం లేదు.
-బీ.కవిత, డీఎస్సీ 2008 అభ్యర్థిని