ఖమ్మం సిటీ, ఫిబ్రవరి 11: రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించి జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని డీవైఎస్వో తుంబూరు సునీల్‌రెడ్డి ఆకాంక్షించారు. రెండు రోజులపాటు ఖమ్మం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహించిన జిల్లాస్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు బుధవారం విజయవంతంగా ముగిశాయి. మొత్తం 40 క్రీడాంశాల్లో ఫైనల్ పోటీలు నిర్వహించగా.. ఖమ్మం, మధిర, సత్తుపల్లి, వైరా, పాలేరుతోపాటు కామేపల్లి నుంచి హాజరైన క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభను కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
రెండోరోజు హ్యాండ్‌బాల్, ఉషు, జూడో, తైక్వాండో అంశాల్లో పోటీలు జరిగాయి. జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి తుంబూరు సునీల్‌రెడ్డి, ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి కిస్టఫర్, ఎస్జీఎఫ్ సెక్రెటరీ రామారావు పోటీలను ప్రారంభించారు. పటేల్ స్టేడియంతోపాటు ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానాల్లో క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులను అభినందిస్తూనే, అక్కడ కూడా రాణించి పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.
రెండు రోజులపాటు జరిగిన జిల్లాస్థాయి సీఎం కప్ క్రీడా పోటీలకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. పోటీల నిర్వహణకు వివిధ శాఖల అధికారులు, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ యంత్రాంగం, కోచ్‌లు గౌస్, ఆదర్శ్‌కుమార్, ఉదయ్‌కుమార్, శైలజాలక్ష్మి, రాములు, సీఐ అంజలి సహకరించగా.. బియ్యని కృష్ణయ్య, రంజాన్ హర్షిత, పారిజాతం, భాగ్యమ్మ, అన్నపూర్ణ, సునీత, రోజా, అంజయ్య, చంద్రశేఖర్, సైదులు, చంద్రకాంత్, హరీశ్, పరిపూర్ణాచారి, సునీత, లాలయ్య, షఫీ, మోహన్, నేహాల్ తదితరులు పాల్గొన్నారు. కాగా.. హ్యాండ్‌బాల్ మహిళల విభాగంలో ఖమ్మం విన్నర్స్, మధిర రన్నర్స్, పురుషుల విభాగంలో ఖమ్మం విన్నర్స్, పాలేరు రన్నర్స్‌గా నిలిచారు. ఉషు సబ్ జూనియర్స్ విభాగంలో సిద్ధార్థ, 42 కేజీల విభాగంలో చక్రధర్ ఆర్యన్, 45 కేజీల బాలుర విభాగంలో చైతన్య, సబ్ జూనియర్స్ బాలికల విభాగంలో సాయి భవ్య విన్సర్స్గా నిలిచారు.