తిరుమలాయపాలెం, మార్చి 23: మండల పరిధిలోని దమ్మాయిగూడెంలో ‘మిషన్ భగీరధ’ నీరు పూర్తిస్థాయిలో అందడం లేదు.. దీంతో గ్రామంలోని ప్రజలకు తాగునీటి కొరత ఏర్పడింది. దమ్మాయిగూడెంలో ఉన్న సంపు ద్వారానే పలు గ్రామాలకు తాగునీటి సరఫరా జరుగుతున్నప్పటికీ తమ గ్రామానికి మాత్రం అరకొరగా సరఫరా ఉందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీరు సరిపోకపోవడంతో అధికారులు ఊరుబయట ఉన్న మంచినీటి బావి ద్వారా గ్రామానికి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. చాలాకాలంగా నిరుపయోగంగా ఉన్న బావి నుంచి నీటిని సరఫరా చేస్తుండడంతో పలువురి చర్మంపై దురద, దద్దుర్లు వస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామంలోని పలు ప్రాంతాల్లో గేటువాళ్లు, ఎయిర్ వాళ్లకు పైకప్పులు లేకపోవడంతో దుమ్ముధూళి పడి నీరు కలుషితంగా మారుతున్నది. ఇప్పటికైనా అధికారులు మిషన్ భగీరధ ద్వారా స్వచ్ఛమైన నీటిని గ్రామానికి సరఫరా చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయమై ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ఎస్కే ఖలీల్‌ను వివరణ కోరగా మిషన్ భగీరధ నీటి కొరత వల్ల బావి నుంచి నీటిని సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల విజ్ఞప్తి మేరకు ఎంపీడీవో శిలార్ సాహెబ్ ఆధ్వర్యంలో బావి నీటిని పరీక్ష కోసం ల్యాబ్‌కు పంపించినట్లు వివరించారు.
గడిచిన పదేళ్లు మాకు మిషన్ భగీరధ ద్వారా నిరంతరం తాగునీరు వచ్చింది. నీటికొరత ఉండేది కాదు.. ఇప్పుడు చెరువు వద్ద ఉన్న బావి నుంచి సరఫరా ఇస్తున్నారు. చాలా ఏండ్లు ఆ బావి పడావుబడినందున ఆ నీళ్లతో అనేకమందికి చర్మంపై దురద వస్తున్నది. మా ఊరు నుంచే అన్ని ఊర్లకు మిషన్ భగీరధ నీళ్లు పోతయి. మా ఊరుకి మాత్రం నీళ్లు రావడం లేదు.
– పల్లి రాధమ్మ, దమ్మాయిగూడెం
చర్మవ్యాధులు వస్తున్నయ్..
బావి నీటితో చర్మవ్యాధులు వస్తున్నాయి. మాకు మిషన్ భగీరధ నీళ్లను మాత్రమే సరఫరా చేయాలని పంచాయతీ సెక్రటరీని అడిగితే మీ ఇద్దరు ముగ్గురికి మాత్రమే దురద వస్తుంది? అందరూ అంటేనే మిషన్ భగీరధ నీళ్లు ఇస్తామని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. అనేకమందికి ఆ నీటితో దురద వస్తున్న మాట వాస్తవం. ఉన్నతాధికారులు వెంటనే పట్టించుకోవాలి. మండల అధికారులకు ఇప్పటికే ఫిర్యాదు చేశాం.
– ఎస్కే లాల్‌బీ, దమ్మాయిగూడెం