Drinking Water | జూలూరుపాడు, మార్చి 16: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామపంచాయతీ పరిధిలోని దుబ్బ తండాలో మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీరు రావటం లేదు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు.. ఖాళీ బిందెలతో ట్యాంక్ పైకెక్కి ఆందోళన చేపట్టి వారి నిరసన వ్యక్తం చేశారు.
వ్యవసాయ పనులకు వెళ్ళి సాయంత్రం ఇంటికి వస్తే తాగునీరు, ఇంటి అవసరాలకు వాడుకునేందుకు నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారి గోడు వెళ్ళబోసుకున్నారు. మిషన్ భగీరథ ట్యాంక్ ద్వారా తాగునీరు అందించడం లేదని తాగునీటి కోసం ప్రతిరోజు ఓ యుద్ధమే చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ఉన్న డైరెక్ట్ పైపులైన్ సైతం మరమ్మతులకు గురై తాగునీరు అందడం లేదని ఎత్తైన ప్రాంతంలో ఉన్న తండాలో నీరు లేకపోవడంతో పొలాల వద్ద ఉన్న బోరుబావుల వద్దకు వెళ్లి తాగునీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితులు దాపురించాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే విద్యుత్ మోటార్‌ను మరమ్మతులు చేయించి తాగునీరు అందించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తాగునీరు అందించాలని దివ్యాంగుడు సైతం వాటర్ ట్యాంక్ ఎక్కి ఆందోళన చేపట్టడంతో గ్రామంలో ఉన్న తాగునీటి తీవ్రత ఎంత ఉందో అర్థమవుతుందన్నారు. గ్రామస్తులు ఆందోళన చేస్తున్న విషయాన్ని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ దృష్టికి స్థానిక నాయకులు దొండపాటి శ్రీనివాస్ రావు తీసుకెళ్లడంతో వెంటనే తాగునీటి సమస్య పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు నిరసన విరమించారు.