ఖమ్మం రూరల్, ఏప్రిల్ 05 : పచ్చటి పొలాలు, ప్రశాంతమైన పోలేపల్లి గ్రామాన్ని మరో లగచర్లగా తయారు చేయద్దని అధికారులను రైతు సంఘం నేతలు మాదినేని రమేశ్, బొంతు రాంబాబు తీవ్రంగా హెచ్చరించారు. శనివారం ఖమ్మం రూరల్ మండలం పరిధిలోని పోలేపల్లి, గొల్లపాడు పంట పొలాలను సందర్శించి బాధిత రైతులతో మాట్లాడారు. గత కొద్ది రోజులుగా నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన భూముల సర్వే ప్రక్రియను రెవిన్యూ అధికారులు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఆయా గ్రామాలకు సంబంధించిన భూములను గుర్తించి ఫెన్సింగ్ వేసే ప్రక్రియ చేపట్టారు. ఈ క్రమంలో రైతు సంఘం నాయకులు గ్రామంలో పర్యటించారు. గ్రామంలో రెవెన్యూ అధికారులు సర్వే చేసిన ప్రాంతంలో పంట పొలాలను పరిశీలించి, బాధిత రైతులకు భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్ఎస్పీ కాల్వ కోసం 50 ఏళ్ల క్రితం మట్టిని తీసేందుకు గతంలో ఎన్ఎస్పీ అధికారులు భూమి కొనుగోలు చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే అనంతరం అట్టి భూమిని యజమానులు పోలేపల్లి గొల్లపాడుకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీకి చెందిన సన్న, చిన్నకారు రైతులకు అమ్మడం జరిగిందని తెలిపారు. మొత్తం 275 ఎకరాల్లో 150 మంది రైతులు కొనుగోలు చేసి సాగు చేస్తున్నట్లు చెప్పారు. 50 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన భూమిపై ఇప్పుడు సర్వే చేసి ప్రభుత్వం తిరిగి లాక్కోవడం దుర్మార్గమైన చర్య అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ సమీపంలోని లగచర్ల తరహాలోనే ఈ ఘటనకు అధికారులు పాల్పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ రైతుల నుంచి భూమిని లాక్కొని మున్నేరు రిటర్నింగ్ వాల్ బాధితులకు అప్పగించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. ఇప్పటికైనా గుర్తించిన భూమిని తిరిగి పేద దళిత రైతులకు అప్పగించి వారికి న్యాయం చేయాలని, లేనియెడల రైతుల పక్షాన నిలబడి రైతులతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, సిఐటియు, రైతు సంఘాలకు చెందిన నాయకులు పెరుమల్లపల్లి మోహన్ రావు, దండగల రాంబాబు, వెంకట్‌రెడ్డి, కొండం కరుణాకర్, రాంబ్రహ్మం, అక్కినపల్లి వెంకన్న, నాగేశ్వరరావు, రాములు, కనకయ్య, లక్ష్మణ్, కోటయ్య, సైదిరెడ్డి, రత్నం పాల్గొన్నారు.
Khammam : పోలేపల్లిని మరో లగచర్లగా మార్చొద్దు : రైతు సంఘం నాయకులు