– గిరిజనుల భూముల జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తి లేదు
– కేసులు ఉపసంహరించుకోకపోతే మంత్రి పొంగులేటి కార్యాలయం ముట్టడిస్తాం
– తక్షణం గిరిజనుల భూములు గిరిజనులకు అప్పగించాలి
– లేనియెడల పంచాయతీ ఎన్నికల్లో గిరిజనుల ఆగ్రహం చూడాల్సి వస్తుంది
– రాష్ట్ర ఎల్‌హెచ్‌పీఎస్ అధ్యక్షుడు రాజేశ్ నాయక్ సవాల్
ఖమ్మం రూరల్, నవంబర్ 28 : ఎంతో ప్రశాంతంగా ఉన్న ఎదులాపురం మున్సిపాలిటీ ప్రాంతాన్ని మరో లగచర్లగా తయారు చేయవద్దని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్ నాయక్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో గతంలో గిరిజనులకు కేటాయించిన అసైన్డ్ భూములను వివిధ గిరిజన సంఘాల నాయకులు, బాధిత గిరిజన రైతులతో కలిసి పరిశీలించారు. సర్వే నంబర్ 136కు సంబంధించిన భూమిలో గతంలో తాము వేసుకున్న ఫెన్సింగ్, మామిడి, ఆయిల్‌పామ్ మొక్కలను రెవెన్యూ, పోలీస్ అధికారులు బలవంతంగా తీసివేసిన ప్రాంతాన్ని బాధితులు బానోతు కృష్ణ, రామ్మూర్తి సంఘం నాయకులకు క్షేత్రస్థాయిలో చూపించారు. అనంతరం అదే ప్రాంతంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు కిషన్ నాయక్, ఇతర సంఘ నాయకులతో కలిసి రాజేశ్‌నాయక్ మాట్లాడారు.
ఒక్కటి కాదు, రెండు కాదు 45 ఏళ్ల కిందట గిరిజనులకు నాటి ప్రభుత్వం అసైన్డ్ పేరుతో భూములు ఇవ్వడం జరిగిందన్నారు. అనంతరం వారికి పట్టాదారు పాస్ పుస్తకాలను కూడా ఆ తర్వాత ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. 2010 సంవత్సరంలో ఇదే భూమిని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం లాక్కోవాలని ప్రయత్నం చేసిందని, ఇప్పుడు మరోసారి అదే ప్రయత్నం కొనసాగించడం జరిగిందన్నారు. ఒక్కరోజు ముందుగానే నోటీసులు ఇచ్చి గిరిజనులను భయభ్రాంతులకు గురిచేసి రెవెన్యూ అధికారులు గిరిజనుల భూముల్లో ప్రభుత్వ భూమి స్థలంగా బోర్డు పెట్టడం సరికాదన్నారు. ఇదేమిటని ప్రశ్నించిన బాధిత గిరిజనుడిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, అదే వ్యక్తి పాఠశాలలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తుండగా ఉద్యోగం నుండి సైతం సస్పెండ్ చేయించడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు.

Khammam Rural : ‘ఏదులాపురమును మరో లగచర్లగా తయారు చేయొద్దు’
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గిరిజన ఓట్లతో గెలిచి ఇలా గిరిజనుల భూములను అధికారులు లాక్కుంటుంటే చూడటం సరికాదన్నారు. తక్షణం గిరిజనుల భూమిని గిరిజనులకు అప్పగించాలని, వారిపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. లేనియెడల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంప్ కార్యాలయాన్ని వేలాదిమంది గిరిజనులతో కలిసి ముట్టడిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఖమ్మం తదితర జిల్లాల్లోని అనేక ప్రదేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనుల భూములను లాక్కునే ప్రయత్నం చేస్తుందని, ఇలాంటి చర్యలు ఉపసంహరించుకోకపోతే పంచాయతీ ఎన్నికల్లో గిరిజనులు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడం జరుగుతుందన్నారు. ఇప్పటికైనా జిల్లా రెవెన్యూ అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి దశాబ్దాలుగా గిరిజనులకు ఉన్నటువంటి భూమిని వారికి అప్పగించాలని, లేనియెడల ప్రత్యక్ష పోరాట కార్యాచరణ సిద్ధం చేసి రాష్ట్రవ్యాప్తంగా ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకురావడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘాల నాయకులు కిషన్ నాయక్, సుశీల, కేశవ నాయక్, చందులాల్, ఆర్ పి ఐ పార్టీ నేత నకిరేకంటి సంజీవరావు, రాంబాబు నాయక్ పాల్గొన్నారు.

Khammam Rural : ‘ఏదులాపురమును మరో లగచర్లగా తయారు చేయొద్దు’