అశ్వారావుపేట, సెప్టెంబర్ 26 : ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘కేసీఆర్ కిట్ల పథకం’ కాంగ్రెస్ ప్రభుత్వంలో సక్రమంగా అమలు కావడం లేదు. కేవలం బాలింతలకు ఆరోగ్య కిట్‌ను మాత్రమే అందిస్తున్నారు. నగదు ప్రోత్సాహకాన్ని ఇవ్వడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన బాలింతలకు గత కేసీఆర్ సర్కారులో కేసీఆర్ కిట్‌ను అందించేవారు. తల్లీబిడ్డల ఆరోగ్య సంరక్షణకు ఇది ఎంతగానో ఉపయోగపడేది.
ఆ కిట్లతోపాటు నగదు ప్రోత్సాహకాన్ని కూడా బాలింతలకు అందించేవారు. గత జనవరి నుంచి భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా 5,263 మంది గర్భిణులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించారు. వీరందరికీ నగదు ప్రోత్సాహం అందలేదు. గర్భిణుల ప్రసవంలో ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీని నియంత్రించడంతోపాటు ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కల్పించడానికి, మెరుగైన వైద్య సేవలు అందించడానికి గత కేసీఆర్ ప్రభుత్వం 2017 జూన్ నెలలో కేసీఆర్ కిట్ల పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా తల్లి, బిడ్డ ఆరోగ్య సంరక్షణ కోసం 16 రకాల వస్తువులతో కూడిన కిట్‌ను అప్పటి కేసీఆర్ సర్కారు అందించింది.
అలాగే మగబిడ్డ జన్మిస్తే రూ.12 వేలు, ఆడబిడ్డ జన్మిస్తే రూ.13 వేల చొప్పున నగదు ప్రోత్సాహం కూడా మంజూరు చేసింది. కానీ.. తొమ్మిది నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. కేసీఆర్ కిట్ పథకాన్ని మాతా, శిశు సంరక్షణ పథకంగా మార్చింది. దాని ద్వారా కేవలం ఆరోగ్య వస్తువుల కిట్‌ను మాత్రమే అందిస్తోంది. కానీ.. ప్రోత్సాహక నగదును మాత్రం అందించడం లేదు. అయితే, ఈ ఏడాది జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన 5,263 మంది గర్భిణుల్లో కొందరికి మాత్రమే కిట్లు అందాయి. నగదు ప్రోత్సాహం ఎవరికీ అందలేదు.
నగదు ప్రోత్సాహకాన్ని గత కేసీఆర్ సర్కారు నాలుగు విడతల్లో అందించింది. బిడ్డకు టీకాలు వేయించడంలో నిర్లక్ష్యంగా ఉండొద్దనే ఉద్దేశంతో నగదు ప్రోత్సాహకాన్ని విడతలవారీగా బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. ఆసుపత్రిలో గర్భిణిగా నమోదు చేసుకుని కనీసం రెండుసార్లు వైద్య పరీక్షలు చేయించుకున్న తర్వాత మొదటి విడతగా రూ.3 వేలు అందించేది. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించిన తర్వాత ఆడబిడ్డ పుడితే రూ.5 వేలు, మగ బిడ్డ పుడితే రూ.4 వేలతోపాటు రూ.2 వేల విలువ గల కేసీఆర్ కిట్‌ను రెండో విడతగా అందించేది. బిడ్డ పుట్టినప్పటి నుంచి మూడున్నర నెలల కాలంలో నిర్దేశిత టీకాలు తీసుకున్న తర్వాత మూడో విడతగా రూ.2 వేలను ఇచ్చేది. బిడ్డ పుట్టినప్పటి నుంచి 9 నెలల కాలంలో టీకాలు పూర్తిగా తీసుకున్న తర్వాత రూ.3 వేల చొప్పున నాలుగో విడత కింద నగదు ప్రోత్సాహకం అందించేది.
కేసీఆర్ కిట్ల పథకాన్ని మాతా, శిశు సంరక్షణగా మార్పు చేసిన రేవంత్‌రెడ్డి సర్కారు.. బాలింతలకు కేవలం కిట్ మాత్రమే పంపిణీ చేస్తోంది. నగదు ప్రోత్సాహకాన్ని ఇవ్వడం లేదు. ఆ కిట్లు కూడా కొందరు బాలింతలకే అందుతున్నాయి. నగదు ప్రోత్సాహకం ఏ ఒక్కరికీ అందడం లేదు. జిల్లాలోని 47 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు 5,263 మంది గర్భిణులు ప్రసవించారు. వీరంతా నగదు ప్రోత్సాహం కోసం ఎదురు చూస్తున్నారు.
కొత్తగూడెం రామవరంలోని జిల్లా మాతా శిశు ఆరోగ్యం కేంద్రంలో గత ఏడాది ఆగస్టు 22న నేను మొదటి కాన్పులో బిడ్డకు జన్మనిచ్చాను. సుమారు ఏడాది కాలం దాటినా ఇప్పటి వరకు ఆరోగ్య సంరక్షణ కిట్టు గానీ, నగదు ప్రోత్సాహకం గానీ అందలేదు. ఆరోగ్య కిట్టుతోపాటు నగదు ప్రోత్సాహం కూడా వస్తుందేమోనని చూస్తున్నాను.
-పద్దం స్వాతి, బాలింత, చండ్రుగొండ
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించే బాలింతలకు నగదు ప్రోత్సాహకం కోసం బిల్లులను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి ప్రతిపాదిస్తున్నాం. గర్భిణి ప్రసవించిన తర్వాత ప్రస్తుత ప్రభుత్వం అందిస్తున్న మాతా, శిశు సంరక్షణ పథకం కిట్లు బాలింతలకు అందిస్తున్నాం. నిధుల విడుదల తర్వాత నగదు ప్రోత్సాహకం అందుతుంది.
-డాక్టర్ రాందాస్, ప్రభుత్వ వైద్యుడు, అశ్వారావుపేట