ఖమ్మం సిటీ, జూన్ 26 : ప్రభుత్వ మెడికల్ కళాశాలల నిర్వహణలో ప్రజల నుంచి అనేక ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో నేరుగా రంగంలోకి దిగిన రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ సభ్యులు కళాశాలల స్థితిగతులను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటు చేసి మూడేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రాష్ట్ర సంచాలకులు డాక్టర్ నరేందర్‌కుమార్, గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఇందిర బృందం గురువారం ఖమ్మానికి విచ్చేశారు. మెడికల్ కాలేజీలోని ఒక్కో విభాగాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.
కళాశాలలో ఉన్న వసతులు, సిబ్బంది, నిర్వహణాపరమైన అన్ని విభాగాలను తనిఖీ చేశారు. ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేశ్వరరావుతోపాటు ఒక్కో హెచ్‌వోడీ ఇన్చార్జిలతో మాట్లాడి సౌకర్యాల గురించి ఆరా తీశారు. అనంతరం జిల్లా ప్రభుత్వాసుపత్రికి వెళ్లిన అధికారులు.. వార్డులు, మాతా, శిశు సంరక్షణ విభాగాన్ని కలియతిరిగారు. రోగులు, గర్భిణులు, బాలింతలతో మాట్లాడి అందుతున్న సేవలు, వైద్యులు, సిబ్బంది పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు.
పెద్దాసుపత్రి పర్యటన తర్వాత ప్రభుత్వ మెడికల్ కళాశాలకు వెళ్లి అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో డీఎంఈ బృందం తాము పరిశీలించిన అంశాలను ప్రస్తావించారు. కాలేజీలోని ఖాళీ స్థలాన్ని మొత్తం సిమెంట్‌తో పూడ్చివేయాలన్నారు. పెద్దాసుపత్రిలోని క్యాజువాలిటీలో మూడు నుంచి నాలుగు బెడ్స్‌ను ఏర్పాటు చేయాలన్నారు.
డైట్‌కు సంబంధించి ప్రత్యేక ఆర్వో ప్లాంట్ ఉండాలని, ఓపీ గదులు, ఇన్‌పేషెంట్స్ గదులు పెద్దగా లేవని, వాటిని సరి చేసుకోవాలన్నారు. మాతా, శిశు సంరక్షణ విభాగంలో ఓపీ దగ్గర రద్దీ ఎక్కువగా కనిపించిందని, బయట ఒక షెడ్డును నిర్మించి అందులో రిజిస్ట్రేషన్ చేసుకుంటే బాగుంటుందన్నారు. ఈ క్రమంలోనే ఖమ్మం వైద్యాధికారులు సైతం తమ ఇబ్బందులను బృందం దృష్టికి తీసుకెళ్లారు.
అవసరాలన్నింటిపై నివేదిక రూపొందించి తమకు సమర్పించాలని రాష్ట్ర బృందం తెలిపింది. వారికి డీఎంహెచ్‌వో డాక్టర్ బి.కళావతిబాయి, ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేశ్వరరావు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కేసగాని సృజన, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్.కిరణ్‌కుమార్, ఆర్ఎంవోలు డాక్టర్ బి.రాంబాబు, డాక్టర్ వినాయక్ రాథోడ్, డాక్టర్ బాబూరత్నాకర్ తదితరులు స్వాగతం పలికి, అన్ని విభాగాలను దగ్గరుండి చూపించారు.