కరకగూడెం, మే 10: అడవుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. మొక్కలను విరివిగా నాటి చెట్లను పెంచి భవిష్యత్ తరాలకు ఆహ్లాద వాతావరణాన్ని అందించాలని సూచించారు. తునికాకు కార్మికులకు మంజూరైన బోనస్ చెక్కులను ప్రభుత్వ విప్ రేగా కాంతారావుతో కలిసి కరకగూడెం పంచాయతీ కార్యాలయ ఆవరణలో బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2016 నుంచి 2021 వరకు ఉన్న పెండింగ్ తునికాకు బోనస్‌ను చెక్కు రూపంలో లబ్ధిదారులకు అందిస్తున్నట్లు చెప్పారు. పినపాక నియోజకవర్గంలో తునికాకు సేకరించిన కార్మికులకు రూ.33.60 కోట్ల బోనస్ అందిస్తున్నట్లు తెలిపారు. గతంలో 50 ఆకుల తునికాకు కట్టకు రూ.2.5గా ఉన్న ధరను ప్రభుత్వం రూ.3కి పెంచిందని తెలిపారు. పెంచిన ధర ఈ ఏడాది నుంచే అమల్లోకి వస్తుందని అన్నారు. గిరిజనులు అటవీ ఉత్పత్తులను సేకరించి ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. అర్హులందరికీ జూన్ నాటికి పోడు పట్టాలు అందజేస్తామని స్పష్టం చేశారు. పట్టాల ప్రక్రియ ఇప్పటికే పూర్తి కావచ్చిందని తెలిపారు. పోడు పట్టాల అనంతరం ఎవరూ అడవులను నరకొద్దని, అడవులను పెంచడంలో బాధ్యతగా మెలగాలని సూచించారు. తొలుత అటవీ అధికారులతో కలిసి మంత్రి మొక్కనాటి నీరు పోశారు. రాష్ట్ర పీసీసీఎఫ్ ఆర్ఎం దొబ్రియల్, ఐదు జిల్లాల డీఎఫ్‌వో (స్కాడ్) నాగభూషణం, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా చీఫ్ కన్జర్వేటర్ భీమా, డీఎఫ్‌వో రంజిత్‌నాయక్, ఆర్డీవో స్వర్ణలత, ఎంపీపీలు రేగా కాళిక, గుమ్మడి గాంధీ, సర్పంచ్ ఊకే రామనాథం, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఏజెన్సీ అభివృద్ధికి అధిక నిధులు: రేగా
గతంలో ఏ ప్రభుత్వమూ ఏజెన్సీ ప్రాంతాలను పట్టించుకున్న పాపన పోలేదని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే ఏజెన్సీ పాంత్రాల అభివృద్ధి కోసం వేల కోట్ల నిధులు కేటాయిస్తున్నారని అన్నారు. అటవీ ప్రాం తాల్లో నివసించే ప్రజలు అటవీ ఉత్పత్తులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని శాలువాతో సత్కరించారు.
బోనస్ చెక్కులు అందజేయడం ఆనందంగా ఉంది..
2016 నుంచి 2021 వరకు పెండింగ్‌లో ఉన్న తునికాకు బోనస్‌ను ప్రభుత్వం అందజేయడం చాలా ఆనందంగా ఉంది. మా మండలానికి నేరుగా మంత్రి వచ్చి చెక్కులు పంపిణీ చేయడం చాలా గొప్ప విషయం. ఏ ప్రభుత్వాలు చేయని చక్కటి కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తోంది.
–గొగ్గలి నర్సమ్మ, దేవరనాగారం, కరకగూడెం
ప్రభుత్వానికి రుణపడి ఉంటాం..
ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉంటున్న తునికాకు బోనస్ చెక్కులను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నేరుగా మా మారుమూల మండలానికి వచ్చి అందజేడయం చాలా సంతోషంగా ఉంది. తునికాకు సేకరణ కార్మికులందరూ బీఆర్ఎస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటారు. – సిద్ది సతీశ్, చిరుమళ్ల, కరకగూడెం