‘జన్మనిచ్చే తల్లి, పుట్టబోయే బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉండాలి. కడుపులో బిడ్డ ఎదుగుదల కోసం గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలి.’ ఇవన్నీ అందరికీ సాధ్యం కాదనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వమే గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లు అందజేస్తూ భరోసా కల్పిస్తున్నది. ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్‌సీల్లో ఉచితంగా వైద్య పరీక్షలు చేయిస్తున్నది. రక్తహీనత ఉన్న వారిని గుర్తించి.. అంగన్వాడీ కేంద్రాల్లో బలవర్దకమైన ఆహారం అందజేస్తున్నది. తల్లి కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఎదగడం.. ప్రసవ సమయంలోనూ సమస్యలు తలెత్తకుండా చేయాలనే ఉద్దేశంతో న్యూట్రిషన్ కిట్లను అందజేశారు. గర్భిణులు సాధారణ ప్రసవం అయ్యేందుకు కూడా కిట్లలోని ప్రొటీన్లు ఎంతో దోహదపడుతున్నాయి. ఈ పథకం కింద భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 16,300 మంది గర్భిణులు లబ్ధి పొందారు. తమ ఆరోగ్యం, పిల్లల ఆరోగ్యంపై ఇంతటి శ్రద్ధ పెడుతున్న సీఎం కేసీఆర్‌ను, తెలంగాణ ప్రభుత్వాన్ని ఎన్నటికీ మరువమంటున్నారు లబ్ధిదారులు.
భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ) : బిడ్డ కడుపులో పడినప్పటి నుంచి గర్భిణికి మంచి పోషకాలు అందితేనే తల్లి కడుపులో ఆరోగ్యంగా ఎదుగుతుంది. ఎలాంటి పోషకాలు, పౌష్టికాహారం తీసుకోలేని పేద గర్భిణులు ప్రసవ సమయంలో ఇబ్బంది పడడం.. పుట్టే బిడ్డ ఆరోగ్యవంతంగా లేకపోవడంతోపాటు తదితర సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ఆరోగ్యకరమైన సమాజం కోసం.. గర్భిణుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా న్యూట్రిషన్ కిట్‌ను ప్రవేశపెట్టారు. రక్తహీనత ఉన్న జిల్లాలను గుర్తించి ఆయా జిల్లాల పరిధిలో గర్భిణులకు న్యూట్రిషన్ కిట్ అందించేందుకు ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా బలవర్దకమైన ఆహారం అందించేందుకు చర్యలు చేపట్టారు. జిల్లాలో మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఇప్పటికే ప్రసవించిన తల్లులకు కేసీఆర్ కిట్టు అందించడంతోపాటు గర్భిణిగా ఉన్నప్పుడు సరైన పోషకాహారం తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన న్యూట్రిషన్ కిట్టు పథకం జిల్లాలో సక్సెస్ అయ్యింది.
గర్భిణుల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపం నివారించడానికి ప్రభుత్వం సరికొత్త ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా తొలిసారిగా తొమ్మిది జిల్లాల్లో న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేసి తర్వాత అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఒక్కో కిట్‌లో కిలో ప్రొటీన్ పౌడర్ ప్యాకెట్, 3 ఐరన్ సిరప్లు, ఖర్జూర, నెయ్యి ప్యాకెట్, ఆల్బెండజోల్ ట్యాబ్లెట్, ఒక కప్పు సైతం ఉంటాయి. ఆయా కేంద్రాల్లో నమోదైన గర్భిణులకు ముందుగా పీహెచ్‌సీల పరిధిలో పంపిణీ చేయగా.. రెండో విడత ప్రసవమైన కేంద్రాల వద్ద న్యూట్రిషన్ కిట్లు ఇస్తున్నారు.
పౌష్టికాహారంతోపాటు రక్తహీనత సమస్యలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేస్తుండగా.. జిల్లాలో 16,300 మంది గర్భిణులకు ఇప్పటివరకు కిట్లు అందజేశారు . జిల్లాలోని 29 పీహెచ్‌సీలు, 5 యూపీహెచ్‌సీలు, 4 సీఎఫ్డబ్ల్యూసీ కేంద్రాలు ఉండగా.. 13 నుంచి 27 వారాల గర్భిణులకు మొదటి కిట్, 28 నుంచి 34 వారాల గర్భిణులకు రెండో న్యూట్రిషన్ కిట్‌ను అందిస్తారు. మొదటి కిట్ అందించిన నెల రోజులకు రెండో కిట్ పంపిణీ చేస్తారు. ప్రతి ఆరోగ్య ఉప కేంద్రం పరిధిలో 13 నుంచి 27 వారాల గర్భిణులు, 28 నుంచి 34 వారాల గర్భిణులు ఎంత మంది ఉన్నారన్నది పక్కాగా లెక్కలు తీసుకుని వీటిని పంపిణీ చేస్తున్నారు.
కాబోయే తల్లి ఆరోగ్యంగా ఉండేందుకు అంగన్వాడీ కేంద్రాల్లో జబ్బ కొలతల ద్వారా రక్తహీనత పరీక్షలు చేస్తున్నారు. నెలనెలా అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులుగా నమోదైన వారికి ఆరోగ్య పరీక్షలు చేయడంతోపాటు జబ్బ కొలతలు తీసి రక్తహీనత లోపాన్ని గుర్తిస్తున్నారు. లోపం ఉన్న వారికి ప్రత్యేకంగా డబుల్ రేషన్ ఇచ్చి వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడంలో అంగన్వాడీలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. దీంతోపాటు సీడీపీవోలు, డీడబ్ల్యూవోలకు జూమ్ మీటింగ్‌ల ద్వారా సమావేశాలు నిర్వహించడంతోపాటు గర్భిణుల ఆరోగ్యవంతమైన జీవితానికి తమవంతు కృషి చేస్తున్నారు.
బిడ్డ పుట్టిన తర్వాత ఇబ్బంది పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే సరైన సమయంలో మంచి పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవాలి. అందరికీ అలాంటి ఆహారం దొరికినా నిర్లక్ష్యం చేస్తారు. దీంతో తెలంగాణ ప్రభుత్వమే ఒకడుగు ముందుకేసి పీహెచ్సీలలోనే మంచి ఆహారం అందజేస్తున్నది. దీనివల్ల తల్లితోపాటు బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు. సీఎం కేసీఆర్ ఏ పథకం ప్రవేశ పెట్టినా అది ప్రజల బాగు కోసమే.
తల్లీబిడ్డ కోసం ఆలోచించే ప్రభుత్వం ఉందంటే అంతకంటే ఇంకేం కావాలి. అంగన్వాడీ కేంద్రాల్లో పాలు, గుడ్లు ఇస్తున్నారు. ఆరు నెలల తర్వాత పోషకాల కిట్టు ఇస్తున్నారు. కిట్లు రెండు సార్లు ఇస్తున్నారు. ఆస్పత్రిలో ప్రసవం తర్వాత కేసీఆర్ కిట్టు ఇస్తున్నారు. మాకు అంతకంటే ఏం కావాలి. మంచి పథకాలు ప్రవేశ పెట్టిన కేసీఆర్ సారు మళ్లీ ముఖ్యమంత్రిగా రావాల్సిందే. ఇటువంటి సీఎంను ఎప్పటికీ మరువం.
ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటున్నది. గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లు అందించేందుకు నిర్ణయించడంతో జిల్లా పరిధిలోని పంపిణీకి ఏర్పాట్లు చేశాం. జిల్లాలో 13 వారాల నుంచి 27 వారాలు, 28 నుంచి 34 వారాల గర్భిణుల వివరాలు సేకరించాం. వారందరికీ కిట్లు అందజేశాం. మంచి పోషకాలు కలిగిన ఆహారం కిట్టులో ఉంది. ఇప్పటివరకు జిల్లాలో 16,300 మందికి కిట్లు అందజేశాం.