మధిర, జూన్ 23 : మహాత్మాగాంధీ ఓల్డ్ క్లాత్ బ్యాంక్ ద్వారా సామాజిక సేవకుడు లంక కొండయ్య సోమవారం కూలీలకు దుస్తులు అందజేశారు. రాజమండ్రి నుంచి మధిరలో కాల్వల పూడికలు తీయడానికి కూలీలు వచ్చారు. ఆ కూలీలకు లంక కొండయ్య మహాత్మాగాంధీ ఓల్డ్ క్లాత్ బ్యాంక్ ద్వారా సేకరించిన పాత బట్టలను పంపిణీ చేయడంపై పట్టణానికి చెందిన ప్రముఖులు అభినందించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కర్నాటి రామారావు, షేక్ జహంగీర్, మైలవరపు చక్రి మాట్లాడుతూ.. కొండయ్య మధిర పట్టణంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎయిడ్స్, కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించారన్నారు. ఎన్నో అవార్డులు పొందిన ఆయన నిరుపేదలకు పాత బట్టలు సేకరించి అందజేయడం హర్షించదగ్గ విషయం అన్నారు. భవిష్యత్లో ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేపట్టాలని వారు ఆకాంక్షించారు.