కూసుమంచి రూరల్, సెప్టెంబర్ 23: పండుగ వచ్చిందంటే అందరికీ సంబురమే. దసరా సందడి చెప్పాల్సిన పనేలేదు. దసరా కానుకగా ప్రభుత్వం బతుకమ్మ చీరెలు అందిస్తుండడంతో మహిళలు సంతోషంగా ఉన్నారు. మరి, పిల్లల సంగతేమిటి..?! వారి చేతిలో ఎంతోకొంత పెడితే సంబురపడుతారు కదా..! పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డికి ఈ ఆలోచన వచ్చినట్లుంది. మండలంలోని వివిధ గ్రామాల్లో ఆసరా పింఛన్ మంజూరు పత్రాలు, బతుకమ్మ చీరెలను శుక్రవారం పంపిణీ చేశారు. పెరికసింగారంలో ఈ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యేకు.. అక్కడి పిల్లలను చూడగానే.. వారిని సంబురపరచాలని అనిపించేదేమో..! 62 మంది చిన్నారులకు ఒకొక్కరికి రూ.500 చొప్పున అందించారు. “దసరా పండక్కి కొత్త బట్టలు కొనుక్కోండి. పండుగ చేస్కోండి” అని వారిని ఉత్సాహపరిచారు. చేతిలోని ఐదొందల నోటు చూసుకుని ఆ పిల్లలంతా మురిసిపోయారు.
బతుకమ్మ చీరెల పంపిణీ
మండలంలోని జక్కేపల్లి ఎస్సీ కాలనీ, జక్కేపల్లి, అజ్మీరా హీరామాన్తండా, పెరికసింగారం, గోరీలపాడు తండా, మల్లాయిగూడెం, జజ్జల్రావుపేట, గుర్వాయిగూడెం గ్రామాల్లో శుక్రవారం ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి పర్యటించారు. ఆసరా పింఛన్ మంజూరు పత్రాలు, బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు.
దేవాలయాలకు విరాళం
వాల్యాతండాలో ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి రూ.2 లక్షలు, జుజ్జల్రావుపేటలో రామాలయానికి రూ.3 లక్షలు విరాళంగా ఎమ్మెల్యే అందజేశారు. ఎంపీపీ బానోత్ శ్రీనివాస్, జడ్పీటీసీ సభ్యురాలు ఇంటూరి భేబీ, డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్, ఆత్మ కమిటీ చైర్మన్ రామసహాయం బాలకృష్ణారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వేముల వీరయ్య, కార్యదర్శి ఆసిఫ్ పాషా, సొసైటీ చైర్మన్ చంద్రారెడ్డి, సర్పంచ్‌లు మాధవి, స్వాతి, వెంకన్న, పద్మ, బీబ్లీ, ఎంపీటీసీ సభ్యులు వెంకటనారాయణ, మోదుగు వీరభద్రం, ఎంపీడీవో కరుణాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మండలంలోని పొన్నెకల్ గ్రామంలో ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి శుక్రవారం పర్యటించారు. గ్రామంలో పెద్దమ్మ తల్లి దేవాలయ అభివృద్ధికి అక్కడికక్కడే రూ.2లక్షలు విరాళంగా ఇచ్చారు. ఎంపీపీ ఉమ, జడ్పీటీసీ సభ్యుడు యండపల్లి వరప్రసాద్, సర్పంచ్ తాటికొండ సుదర్శన్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
చెక్కుల పంపిణీ
మండలంలోని కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులను శుక్రవారం ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి పంపిణీ చేశారు. కూసుమంచిలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు రామసహాయం బాలకృష్ణా రెడ్డి, ఇంటూరి శేఖర్, బానోత్ శ్రీనివాస్, ఇంటూరి బేబి, తహసీల్దార్ మీనన్, ఎంపీడీవో కరుణాకర్ రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వేముల వీరయ్య పాల్గొన్నారు. మండలంలో ఇటీవల టీఆర్ఎస్ కార్యకర్తలు ముగ్గురు మృతిచెందారు. వారికి కుటుంబాలకు బీమా చెక్కులను ఎమ్మెల్యే అందించారు.