కొత్తగూడెం సింగరేణి/ ఇల్లెందు, జూలై 1: సింగరేణిలో 12వ వేజ్ బోర్డు కమిటీని ఏర్పాటు చేసి, వేతన సవరణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల జాక్ ఆధ్వర్యంలో కొత్తగూడెం సింగరేణి హెడ్డాఫీసు ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. ఇల్లెందులో ఐక్య కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి డిమాండ్స్ డే నిర్వహించి, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కొత్తగూడెంలో జరిగిన ధర్నానుద్దేశించి ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ సింగరేణిలో కార్మికుల సహనాన్ని బలహీనతగా భావిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.
కార్మికుల హక్కులను హరించే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, లేదంటే కార్మిక ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 12వ వేతన ఒప్పంద కమిటీ సమావేశం నిర్వహించడంలో జాప్యం చేయడం సరికాదని, లేబర్ కోడ్ల పేరుతో శ్రమ చట్టాలను నిర్వీర్యం చేసే కుట్రలను సహించేది లేదన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నుంచి వాసిరెడ్డి సీతారామయ్య, కొరిమి రాజ్‌కుమార్, సారయ్య, వీరభద్రయ్య, వైవీ రావు, వంగ వెంకట్, గట్టయ్య, ఐఎన్టీయూసీ నుంచి జనక్ ప్రసాద్, త్యాగరాజన్, పీతంబరం, ఆల్బర్ట్, సీఐటీయూ నుంచి మంద నర్సింహారావు, రాజిరెడ్డి, విజయగిరి శ్రీనివాస్, హెచ్ఎంఎస్ నుంచి కృష్ణప్రసాద్, ఆంజనేయులు పాల్గొన్నారు.
ఇల్లెందులో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ, హెచ్ఎంఎస్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జేకేఓసీ, కేఓసీ, సివిల్, వర్క్‌షాప్, జీఎం ఆఫీస్, ఎస్అండ్పీసీ ఏరియా హాస్పటల్, ఏరియా స్టోర్స్‌లలో కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి డిమాండ్స్ డే నిర్వహించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాలను సంబంధిత గనుల అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు నజీర్ అహ్మద్, ఎల్.మధుకర్, నబీ, బాలప్రసాద్లు మాట్లాడుతూ 12వ వేతన కమిటీని ఏర్పాటు చేసి వేతన సవరణను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు కంగర వెంకటేశ్వర్లు, జయరాజ్, సురేశ్, కలవల సిద్ధార్థ్, లచ్చిరామ్, జక్కుల శ్రీనివాస్, యుగేందర్ తదితరులు పాల్గొన్నారు.