ఖమ్మం, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : దేశ స్వాతంత్య్రోద్యమంలో వీర మరణం పొందిన మహనీయుల ఆశయాలను ఆదర్శంగా తీసుకుని తమ ప్రభుత్వం పాలన అందిస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ఖమ్మం జిల్లా ప్రగతి పథంలో పయనిస్తోందని స్పష్టం చేశారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో గురువారం నిర్వహించిన వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, సీపీ సునీల్దత్లతో కలిసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా అభివృద్ధిపై ఆయన ఉపన్యసించారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావించి రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోందని అన్నారు. అభివృద్ధిలో ఖమ్మం జిల్లా అగ్రగామిగా నిలుస్తోందని, దీనికి ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయం, నిబద్ధతే ప్రధాన కారణమని అన్నారు. 1.58 కోట్ల మంది మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించామని, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచి 15,307 మందికి మెరుగైన వైద్య సేవలు అందించామని తెలిపారు.
త్వరలోనే ప్రతి నియోజకవర్గానికీ 3,500 ఇళ్లను మంజూరు చేస్తామన్నారు. జిల్లాలో 3.94 లక్షల గ్యాస్ సిలిండర్లను రాయితీపై అందించామన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం ద్వారా జిల్లా ప్రజలకు రూ.40 కోట్ల మేర లబ్ధి చేకూర్చామన్నారు. 3.38 లక్షల రైతులకు రూ.5,689 కోట్ల పంట రుణాలను మాఫీ చేశామని తెలిపారు. సీతారామ ప్రాజెక్టులో భాగంగా పాలేరు లింక్ కెనాల్ ద్వారా నూతనంగా 47,381 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే ప్రక్రియను చేపట్టామన్నారు. ఏన్కూరు వద్ద రాజీవ్ లింక్ కెనాల్ నిర్మాణం చేపట్టి 7,115 ఎకరాల కొత్త ఆయకట్టుకు గోదావరి జలాలను అందించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఇంకా మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, సంక్షేమ పథకాలు అందించామని వివరించారు.
ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులు, వారి కుటుంబ సభ్యులను సన్మానించారు. డీఎఫ్వో విక్రమ్ సింగ్, కేఎంసీ కమిషనర్ అభిషేక్, శిక్షణ కలెక్టర్ మిర్నల్శ్రేష్ట తదితరులు పాల్గొన్నారు. కాగా, జిల్లాలో సీఎం రేవంత్రెడ్డి పర్యటన ఉన్న నేపథ్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షించకుండానే, ఉత్తమ అధికారులకు ప్రశంసా పత్రాలు అందించకుండానే డిప్యూటీ సీఎం వెళ్లిపోయారు. అనంతరం కలెక్టర్, సీపీ, జిల్లా అధికారులు విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. ఉత్తమ అధికారులకు కలెక్టర్ ప్రశంసా పత్రాలను అందించారు. నృత్య ప్రదర్శనలు చేసిన చిన్నారులతో కలెక్టర్ ఫొటోలు దిగి వారిని అలరించారు. వివిధ శాఖల స్టాళ్లను సందర్శించారు.