ఖమ్మం రూరల్, జూలై 18:‘అమ్మ పెట్టదు.. అడుక్కుతిన్నివ్వదు..’ అనే నానుడిలా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ సర్కారు.. ఆ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను ఒక పట్టాన ఓర్వడం లేదు. పైగా, ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్న పనులను ఎలాగైనా భగ్నం చేయాలన్న పట్టుదలతో ముందుకెళ్తోంది. ఈ క్రమంలోనే ఏదులాపురం మున్సిపాలిటీలోని ‘తెలంగాణ క్రీడా ప్రాంగణాల’పై కాంగ్రెస్ సర్కారు కన్నుపడింది. ఆ క్రీడా మైదానాలు విలువైన భూముల్లో ఉండడం, ప్రజలకు ఉపయోగపడుతుండడం వంటి కారణాలతో ఎలాగైనా వాటిని కనుమరుగు చేయాలని సంకల్పించింది.
దీంతో తన బుల్డోజర్లను తెచ్చి ఆయా క్రీడా ప్రాంగణాలోని బోర్డులను, ఇతర గోడలను కసిదీరా కూల్చివేసింది. క్రీడా మైదానాలను సైతం తవ్వి గుల్ల చేసింది. సాక్షాత్తూ మంత్రి పొంగులేటి ఇలాకాలోనే ఇలాంటి చర్యలు చోటుచేసుకోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినా వెనక్కు తగ్గని కాంగ్రెస్ సర్కారు.. ప్రజలను నమ్మించేందుకు కట్టుకథలు అల్లింది. కూల్చివేసిన క్రీడా ప్రాంగణాల్లో పార్కులు, ఓపెన్ జిమ్‌లు ఏర్పాటుచేస్తామని కబుర్లు చెప్పింది. ఏకంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డే ఆయా నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. 9 నెలల పూర్తయినా ఆ నిర్మాణ పనులను ప్రారంభించిన పాపానపోలేదు.
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటూ నిత్యం వ్యాయామం, నడక తప్పనిసరి. విద్యార్థులు, యువకులకైతే క్రీడలే శారీరక దారుఢ్యాన్ని అందిస్తాయి. ఇందుకోసం వాకింగ్ ట్రాక్‌లు, క్రీడా ప్రాంగణాలు ఎంతో ముఖ్యం. ఇలాంటి అవసరాలను గుర్తించిన గత కేసీఆర్ ప్రభుత్వం ‘తెలంగాణ క్రీడా ప్రాంగణాలు’ పేరిట రాష్ట్రమంతటా క్రీడా మైదానాలను ఏర్పాటుచేసింది. ఇందులో భాగంగా ఏదులాపురం మున్సిపాలిటీ కాకముందు ఖమ్మం రూరల్ మండలంలో ఉన్న పెద్దతండా ఇందిరమ్మ కాలనీలోనూ, పల్లెగూడెంలోనూ రూ.కోట్ల విలువైన భూముల్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటుచేసింది.
అవి అందుబాటులోకి రావడంలో ఆయా గ్రామాల ప్రజలు వాటిని ఎంతగానో వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో రెండున్నరేళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ క్రీడా ప్రాంగణాలపై నిర్లక్ష్యం ప్రదర్శించింది. కొన్నాళ్లపాటు వాటిని ప్రజలు వినియోగించకుండా చేసింది. అవి నిరుపయోగమంటూ ప్రచారం చేసి వాటి స్థానంలో పార్కులు, ఓపెన్ జిమ్‌లు ఏర్పాటుచేస్తామంటూ ప్రచారం చేసింది. అందుకోసమంటూ అప్పటికే ఉన్న క్రీడా మైదానాలను యంత్రాలతో గుల్ల చేసింది. ఆ క్రీడా ప్రాంగణాల్లోని బోర్డులను, గోడలను కసిదీరా కూల్చివేసింది. నామరూపాల్లేకుండా చేసి..
ఏదులాపురం మున్సిపాలిటీ అయ్యాక దాని పరిధిలోని 23వ వార్డు ఇందిరమ్మ కాలనీలో, 1వ వార్డు పల్లెగూడెంలో ఉన్న క్రీడా ప్రాంగాణాలపై కాంగ్రెస్ ప్రభుత్వం కన్నుపడింది.
ఆ భూములు విలువైనవి కావడం, అందులోని క్రీడా ప్రాంగణాల వల్ల గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి పేరు ప్రఖ్యాతులు వస్తుండడం వంటి కారణాలతో ఎలాగైనా వాటిని భగ్నం చేయాలని కుట్ర పన్నింది. ఆయా క్రీడా ప్రాంగణాల్లో నూతనంగా పార్కులు ఏర్పాటు చేయబోతున్నట్లు చెబుతూ.. అప్పటికే వినియోగంలో ఉన్న క్రీడా ప్రాంగణాలను నామరూపాల్లేకుండా చేసింది. ఈ కూల్చివేతల కారణంగా అక్కడి పిల్లలు, విద్యార్థులు క్రీడలకు దూరమయ్యారు. 23వ వార్డులో కూల్చిన ప్రాంగణం మైదానంలో నూతనంగా పార్కు ఏర్పాటు కోసమంటూ సాక్షాత్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. అవే పనులకు సుమారు రెండు నెలల తరువాత స్థానిక కౌన్సిలర్, మున్సిపల్ చైర్పర్సన్ అనిత మరోమారు కొబ్బరికాయలు కొట్టి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. కానీ, ఇప్పటికీ ఆ పనులు పూర్తికాలేదు. పార్కు అందుబాటులోకి రాలేదు.
సాధారణంగా మున్సిపల్ చైర్పర్సన్ వార్డు అంటే అభివృద్ధిలో యావత్ మున్సిపాలిటీకి ఆదర్శంగా ఉంటుందని చెప్పుకుంటారు. కానీ, ఏదులాపురం మున్సిపాలిటీలో చైర్పర్సన్ వార్డు అంటే ఇప్పుడు కూల్చివేతలకు చిరునామాగా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ ప్రాంతంలో ఏర్పాటుచేసిన క్రీడా ప్రాంగణాల కూల్చివేతలు చైర్పర్సన్ వార్డు అయిన 23 వార్డు నుంచే ప్రారంభం కావడం గమనార్హం. అయితే, క్రీడా ప్రాంగణాన్ని కూల్చివేసినప్పుడే స్థానికుల నుంచి వ్యతిరేకత రావడంతో మంత్రి పొంగులేటి అక్కడి ప్రజలకు సర్దిచెప్పారు.
అదే ప్రాంగణంలో పార్కు, ఓపెన్ జిమ్ ఏర్పాటుచేస్తున్నామని చెప్పి ఆయా పనులకు అప్పుడే ఆయన భూమిపూజ చేశారు. కానీ, తొమ్మిది నెలలు గడిచినా ఆ పనులు ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేదు. దీంతో ఇక్కడి అధికార పార్టీ నాయకులు ఇటీవల కొత్త ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఈ ప్రాంతానికి మంజూరైన పార్కు ఆగిపోయిందని, దాని స్థానంలో గిరిజన భవన్ నిర్మించనున్నామని విస్తృత ప్రచారం చేస్తున్నారు. దీంతో సర్కారు తీరుపై స్థానికులు భగ్గుమంటున్నారు. ఆ క్రీడా ప్రాంగణంలో పడి ఉన్న బోర్డులు, కూలిన గోడలను చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఉపయోగకరంగా ఇళ్ల మధ్యలో ఉన్న క్రీడా ప్రాంగణాన్ని ఎందుకు కూల్చివేశారంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు.