ఖమ్మం, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) ; తరగతి గదిలో పాఠాలు బోధించాల్సిన అధ్యాపక బృందాలు, ఉన్నత విద్యాసంస్థలను నిర్వహించే యాజమాన్యాలు రోడ్డెక్కబోతున్నాయి. కాంగ్రెస్ సర్కార్‌తో విసుగుచెంది తమ నిరసనను తెలియజేసేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించాయి. రెండేళ్లుగా రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని మొత్తుకుంటున్నా కనీసం పట్టించుకోని ప్రభుత్వంపై ప్రత్యక్ష ఆందోళనలకు దిగుతున్నారు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిన కాంగ్రెస్.. ప్రభుత్వం ఏర్పడ్డాక కనీసం స్పందించడం లేదు. దీంతో తాము ఇక విద్యాసంస్థలు నడపలేమని, బంద్ చేయడం తప్ప వేరే గత్యంతరం లేదని యాజమాన్యాలు నిర్ణయించాయి. డిగ్రీ, పీజీ, ఫార్మసీ, బీఈడీ, ఎంబీఏ, ఎంసీఏ, ఇంజినీరింగ్ విద్యాసంస్థల రాష్ట్ర ఐక్య కార్యచరణ కమిటీ పిలుపు మేరకు సోమవారం నుంచి నిరసనలు, నిరాహార దీక్షలు, నిరవధిక బంద్‌లు చేయనున్నారు.
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని డిగ్రీ, పీజీ, ఫార్మసీ, బీఈడీ, ఎంబీఏ, ఎంసీఏ, ఇంజినీరింగ్ విద్యాసంస్థలన్నీ సోమవారం నుంచి నిరసనలు, నిరాహార దీక్షలు, బంద్‌లో పాల్గొననున్నాయి. బోధనా రుసుముల కింద చెల్లించాల్సిన నిధులు రూ.కోట్లలో పేరుకుపోయాయి. ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి సుమారు రూ.300 కోట్లు రావాల్సి ఉందని కళాశాలల యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. గత రెండేళ్ల నుంచి కోర్సుల్లో చేరిన విద్యార్థులకు సంబంధించి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. మిగిలిన రెండు, మూడు సంవత్సరాల విద్యార్థులకు సంబంధించి కూడా ఎలాంటి చెల్లింపులు జరగలేదు. రూ.కోట్లాది నిధులు ఆగిపోవడంతో కళాశాలల నిర్వహణ తమకు చాలా కష్టంగా ఉందని ఆయా యాజమాన్యాలు పేర్కొంటున్నాయి.
రౌండ్‌టేబుల్ సమావేశం..
ఖమ్మం నగరంలోని ఎస్బీఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని యాజమాన్యాలు రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించాయి. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోవడం వల్ల ఎదుర్కొంటున్న సమస్యలను లేవనెత్తారు. అందరూ ముక్తకంఠంతో నిరవధిక బంద్‌కు సై అన్నారు. విద్యార్థి సంఘాలు సైతం తమ మద్దతు తెలిపాయి. సమావేశంలో యాజమాన్యాల సంఘాల నాయకులు గుండాల కృష్ణ, ఉషాకిరణ్, మల్లెంపాటి శ్రీధర్, కాటేపల్లి నవీన్‌బాబు, బొంతు సత్యనారాయణ, మద్ది ప్రభాకర్‌రెడ్డి, చలసాని సాంబశివరావు, బొమ్మ రాజేశ్వరరావు, వి.మోహన్‌రెడ్డి, దరిపల్లి కిరణ్, ఏసయ్యచౌదరి పాల్గొన్నారు.
విద్యార్థులకు శాపంగా ప్రభుత్వ నిర్ణయాలు
బోధనా రుసుములు, ఉపకార వేతనాల చెల్లింపులో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో విద్యార్థులకు శాపంగా మారింది. భారీగా బకాయిలు ఏర్పడటంతో వారి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. పేద విద్యార్థుల పట్ల ప్రభుత్వం సవతి తల్లి ప్రేమను కనబరుస్తున్నది. విద్యార్థులు, యాజమాన్యాలు రోడ్డెక్కాల్సిన పరిస్థితికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమే.
– ఇటికాల రామకృష్ణ, ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు
రీయింబర్స్మెంట్ వచ్చేవరకు బంద్
ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్నా రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించలేదు. గతంలో డిగ్రీ కళాశాలలు బంద్ నిర్వహిస్తే నిధులు చెల్లిస్తామని హామీ ఇచ్చినప్పటికీ నిధులు విడుదల కాలేదు. ఇప్పుడు ఉన్నత విద్యాసంస్థలు అన్ని కలిసి ఐక్యంగా పోరాడుతున్నాయి. నిర్వహణ భారంగా మారడంతో నిరవధిక బంద్‌లో పాల్గొనున్నాయి.
– మద్ది ప్రభాకర్‌రెడ్డి, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల ప్రధాన కార్యదర్శి
కాంగ్రెస్ వైఖరితో విద్యార్థులకు కష్టాలు
ఈ నెల 15వ తేదీ నుంచి కళాశాలల యాజమాన్యాలు నిరవధిక బంద్‌కు వెళ్లబోతున్నాయి. లక్షలాది విద్యార్థుల కళ్ళల్లో వెలుగులు ఆరిపోబోతున్నాయనే సంకేతం ఇది. ఒకప్పుడు విద్యార్థులకు భరోసాగా నిలిచిన రీయింబర్స్మెంట్ పథకం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి వల్ల విద్యార్థులు కష్టాలబారిన పడ్డారు.
– వంగూరి వెంకటేష్, పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి
బకాయిలు వెంటనే విడుదల చేయాలి
ప్రభుత్వం బకాయిలను వెంటనే విడుదల చేయాలి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విద్యకు అత్యధిక ప్రాధాన్యతనిస్తామని గొప్పలు చెబుతూ ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు చెల్లించాల్సిన రీయింబర్స్మెంట్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. బకాయిలు విడుదల చేసేవరకు యాజమాన్యాలు ఐక్యంగా ఉండి నిరసన తెలియజేస్తాం.
– గుండాల కృష్ణ, ఆర్జేసీ, ఎస్బీఐటీ చైర్మన్