చండ్రుగొండ, జూలై 15 : చండ్రుగొండ-జూలూరుపాడు రహదారికి ఇరువైపులా చేపట్టిన డ్రైనేజీ నిర్మాణంలో జాప్యం జరుగుతోందని, వెంటనే దానిని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు చండ్రుగొండ-జూలూరుపాడు రహదారిపై సోమవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే పనుల్లో జాప్యం జరుగుతోందని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ వెంటనే జోక్యం చేసుకొని నిర్మాణ పనులకు ఉన్న అడ్డంకులను తొలగించి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా.. గ్రామస్తులు రోడ్డుపై ఆందోళన చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న ఎస్సై జి.స్వప్న అక్కడికి చేరుకొని వారిని సముదాయించారు. ఆర్అండ్బీ ఏఈ లకన్నాయక్తో ఆమె ఫోన్లో మాట్లాడి.. గ్రామస్తుల డిమాండ్‌ను ఆయనకు వివరించారు. దీనికి స్పందించిన ఏఈ వారంలో డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో గ్రామస్తులు, అఖిలపక్షం నాయకులు పాల్గొన్నారు.