Kothagudem | రామవరం, జులై 27: రాష్ట్రంలోని మసీదులలో సేవలు అందిస్తున్న ఇమామ్, మౌజన్ల గౌరవ వేతనాలను పునరుద్ధరణ చేసేందుకు గడువు తేదీని నెల రోజుల పాటు పొడగించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనార్టీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎండీ. యాకూబ్ పాషా ఆదివారం నాడు ఒక ప్రకటనలో రాష్ట్ర వక్ఫ్ బోర్డు అధికారులను కోరారు. గౌరవ వేతనాలను కొనసాగించటానికి పాన్ కార్డ్, ఆదాయ ధ్రువీకరణ పత్రం సమర్పించాలని అధికారులు చెప్పటంతో వీటిని పొందేందుకు ఇమామ్ మౌజన్ లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఆదాయ ధృవీకరణ పత్రం పొందేందుకు రేషన్ కార్డు తప్పనిసరి అయినందున, చాలా మంది ఇమామ్, మౌజన్ లకు రేషన్ కార్డు లేని కారణంగా, ఆదాయ దృవీకరణ పత్రం పొందటం తలకు మించిన భారంగా ఉందని, దీన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు అదాయ ద్రువీకరణపత్రంమును మినహాయించాలని అన్నారు. ఈ మేరకు రాష్ట్ర వక్ఫ్ బోర్డు సీఈవో, రాష్ట్ర మైనారిటీ కార్యదర్శికి లేఖలు కూడా రాయడం జరిగిందని యాకూబ్ పాషా విలేకరులకు తెలియజేశారు.