వైరాటౌన్, జనవరి 7 : రాష్ట్రంలో పాడి పరిశ్రమ అగ్రగామిగా నిలుస్తున్నదని రాష్ట్ర రవాణాశాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. శనివారం పశుగణాభివృద్ధి కేంద్రంలో జరిగిన జాతీయ కృత్రిమ గర్భాధారణ, ఆధునిక సాంకేతిక నిపుణుల సదస్సును ఆయన ప్రారంభించారు. వైరా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బానోత్ చంద్రావతి, జడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, ఎంపీపీ వేల్పుల పావని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ పశువుల ఉత్తమ జన్యు లక్షణాలను అభివృద్ధి చేసి పాల ఉత్పత్తిని పెంచడంతోపాటు మేలురకమైన పశు సంపద పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నదని అన్నారు.
ఒంగోలు, ముర్ర, జెర్సీ ఆబోతుల నుంచి వీర్యాన్ని సేకరించి ఉత్తమ లక్షణాలు గల పశు సంపదను ఉత్పత్తి చేయాలన్నారు. గోపాలమిత్రలకు గౌరవ వేతనం ఇచ్చిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ మాత్రమేనని అన్నారు. కృత్రిమ గర్భాధారణ ద్వారా పశు సంపదను పెంపొందించాలని, మాంసం, పాల ఉత్పత్తుల్లో అగ్రగామిగా నిలవాలని సూచించారు. విజయ డెయిరీని బలోపేతం చేయడానికి రైతులకు సబ్సిడీలు సైతం ప్రభుత్వం అందిస్తున్నదన్నారు.
కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్, మార్క్‌ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, ఆల్డా చైర్మన్ కొర్లకుంట నాగేశ్వరరావు, వైరా మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, వైస్ చైర్మన్ సీతారాములు, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమోతు వెంకటేశ్వరరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ బీడీకే రత్నం పాల్గొన్నారు. వైరా మున్సిపల్ వైస్ చైర్మన్ ముళ్లపాటి సీతారాములు ఇంట్లో తేనేటి విందుకు మంత్రి పువ్వాడ హాజరయ్యారు.