రఘునాథపాలెం, సెప్టెంబర్ 23 : పాల బిల్లుల చెల్లింపులో ప్రభుత్వ నిర్లక్ష్యంపై పాడి రైతులు నిరసనకు దిగారు.. ప్రతి 15రోజులకు చెల్లించే బిల్లులు రెండున్నర నెలలైనా చెల్లించకపోవడంపై మండిపడ్డారు.. ఈ మేరకు సోమవారం ఖమ్మం నగరంలోని విజయ డెయిరీ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎప్పటికప్పుడు పాల బిల్లులు వచ్చేవని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక తీవ్ర జాప్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
అసలు విజయ డెయిరీకి పాలు పోస్తే బిల్లులు వస్తాయో.. లేదో.. నమ్మకం లేకుండాపోయిందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పాల సేకరణ క్రమేపీ తగ్గుముఖం పడుతున్నదని ఆరోపించారు. గ్రామాల్లో కలెక్షన్ ఏజెంట్లకు రైతులు పాలు పోసే పరిస్థితిలేదన్నారు. పశుపోషణ సైతం భారమైనట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఈ నెల 26వ తేదీన హైదరాబాద్ ధర్నాచౌక్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాడి రైతులు ధర్నా చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా నుంచి పెద్దఎత్తున హాజరై ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆందోళన చేసిన వారిలో కోటగిరి నాగేశ్వరరావు, ఇబ్బడి శ్రీను, కుర్రా వినోద్, నల్లగొర్ల శ్రీను, రవీందర్ పాల్గొన్నారు.