భద్రాచలం, అక్టోబర్ 6 : తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 25 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న డైలీవైజ్, ఔట్ సోర్సింగ్ కార్మికులు సోమవారం భద్రాచలం ఐటీడీఏ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కె.బ్రహ్మచారి, బి.నాగేశ్వరరావు, పలువురు కార్మికులు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ఐటీడీఏల పరిధిలో పాత పద్ధతిలోనే కలెక్టర్ గెజిట్ ప్రకారం వేతనాలు చెల్లిస్తుంటే.. భద్రాచలం ఐటీడీఏ పరిధిలో మాత్రం గెజిట్‌ను విస్మరించి కార్మికల పొట్టకొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ద్వంద్వ విధానం వల్ల ప్రతీ కార్మికుడు రూ.16 వేల చొప్పున నష్టపోయారని మండిపడ్డారు.
ఒకే శాఖలో పని చేస్తున్న కార్మికులకు రెండు రకాలుగా జీతాలు చెల్లించడం ఏమిటని ప్రశ్నించారు. డైలీవైజ్ వర్కర్లకు ఇతర ఐటీడీఏల్లో వేసినట్లు ఇక్కడ కూడా పాత జీతమే కలెక్టర్ గెజిట్ ప్రకారం చెల్లించకుంటే యథావిధిగా రాత్రిపూట ఆందోళన కొనసాగుతుందని పేర్కొన్నారు. అయితే దీనిపై జేఏసీ నాయకులతో డీడీ అశోక్‌కుమార్ చర్చించారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం ఆపేది లేదని తేల్చి చెప్పారు. మంగళవారం పది మంది ప్రతినిధులతో సమస్యపై చర్చిస్తామని ఐటీడీఏ పీవో హామీ ఇవ్వడంతో కార్మికులు రాత్రి ఆందోళన విరమించారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు హీరాలాల్, కౌశల్య, మంగీలాల్, ముత్తయ్య, జలంధర్, స్వామి, మంగ, నర్సింహారావు, స్వరూప, తిరుపతమ్మ, జీవా, సమ్మక్కతోపాటు ఉమ్మడి జిల్లా వర్కర్లందరూ పాల్గొన్నారు.