భద్రాద్రి జిల్లాలో గత 10 రోజుల వ్యవధిలో కురిసిన అకాల వర్షాలు, వీచిన ఈదురుగాలులకు అన్నదాతల ఆశలు నేలకూలాయి. చేతికి అందిన పంటలు దెబ్బతినడంతో అన్నదాతలు ఆర్థికంగా నష్టపోయారు. పెట్టుబడి కూడా రాదంటూ దిగులు చెందుతున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలంటూ వేడుకుంటున్నారు. ఈ నెల 16 వరకు జిల్లావ్యాప్తంగా 470 ఎకరాల్లో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. సుమారు 313 మంది ఉద్యాన రైతులు నష్టపోయారు. అయితే, వ్యవసాయ పంటల నష్టం వివరాలు అందించడానికి జిల్లా వ్యవసాయ శాఖాధికారి బాబూరావు అందుబాటులో లేకపోవడం గమనార్హం.
-అశ్వారావుపేట, ఏప్రిల్ 17
ఆరుగాలం చెమటోడ్చి పండించిన పంటలు చేతికి అందే సమయంలో వచ్చిన అకాల వర్షం రైతులను కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. సరైన ధరలు లేక ఏటా నష్టపోతున్న రైతులకు ప్రకృతి విపత్తులు కూడా మరింత నష్టాన్ని కలిగిస్తున్నాయి. వర్షాకాలంలో అధిక వర్షాలు భారీగానే దెబ్బతీస్తున్నాయి. ఎండాకాలంలో అకాల వర్షాలు, ఈదురుగాలులు మరింత నస్టాన్ని మిగుల్చుతున్నాయి. అన్ని రకాల పంటలకూ భారీగానే నష్టం వాటిల్లింది. ముఖ్యంగా మామిడి, మొక్కజొన్న, వరి, అరటి, కూరగాయలు, మునగ, జీడి మామిడి తోటలు నేలమట్టమయ్యాయి.
అకాల వర్షాలతో పంటలు దెబ్బతింటుండడంతో పెట్టుబడులు రాక, అప్పులు పెరిగి రుణాల ఊబిలో కూరుకుపోతున్నారు అన్నదాతలు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ‘రైతు భరోసా’ కూడా అందించకపోవడంతో ఆర్థికంగా మరింత కుదేలవుతున్నారు. పంటల బీమాను ప్రభుత్వం అమలుచేయకపోవడంతో మరింత కుంగిపోతున్నాడు. మద్దతు ధర, పంటల బీమా వంటివి అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం కావడంతో అన్నదాతలకు నష్టాల తీవ్రత మరింతగా పెరుగుతోంది. ప్రకృతి విపత్తులు సంభవించిన సమయంలో పంటలు ఆశలు కూడా వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. విత్తనం నాటిన దగ్గర నుంచి మొదలుకొని కంకి చేతికి వచ్చే వరకూ పంటను కంటికి రెప్పలా కాపాడుకున్నా.. ప్రకృతి విపత్తులు మాత్రం ఒక్కరోజుతో ఆరుగాలం శ్రమను తుడిచిపెడుతున్నాయి.
జిల్లాలో ఈ నెల 7 నుంచి మొదలైన అకాల వర్షాల కారణంగా దెబ్బతింటున్న పంటల వివరాలను ఉద్యానవన శాఖ అధికారులు సేకరిస్తున్నారు. ఈ నెల 16 నాటికి 470 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు గుర్తించారు. ఇందులో సుమారు 313 మంది రైతులు నష్టపోయినట్లు నిర్ధారించారు. దెబ్బతిన్న పంటల్లో 284 మంది రైతులకు చెందిన 425 ఎకరాల మామిడి, 18 మంది రైతులకు చెందిన 34 ఎకరాల అరటి, 10 మంది రైతులకు చెందిన 10 ఎకరాల కూరగాయలు ఉన్నట్లు ప్రాథమిక అంచనా వేశారు. పంట నష్టం సర్వే ఇంకా కొనసాగుతూనే ఉందని అధికారులు చెబుతున్నారు. సర్వే పూర్తయిన తర్వాత నివేదికను కలెక్టర్కు అందజేస్తామంటున్నారు. ఇదిలా ఉంటే వ్యవసాయ శాఖ నుంచి పంట నష్టం అంచనా వివరాలు అందించేందుకు జిల్లా వ్యవసాయాధికారి బాబూరావు అందుబాటులోకి రాలేదు. పలుమార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు.
అకాల వర్షాలు, ఈదురుగాలులతో మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పంట చేతికందే సమయంలో వాతావరణ మార్పుల వల్ల కురిసిన వర్షాలకు దిగుబడిని కోల్పోయాను. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. లేకుంటే అప్పుల ఊబిలో నుంచి బయటపడే పరిస్థితి లేదు.
-ఎస్కే బాజీ, రైతు, దమ్మపేట
తోటల పెంపకం కోసం వెచ్చించిన పెట్టుబడి అకాల వర్షాలకు ఆవిరైపోయింది. దెబ్బతిన్న పంటతో ఆర్థికంగా నష్టపోయాను. అప్పుల ఊబిలో నుంచి ఎలా బయటపడాలో తెలియడం లేదు. పంట చేతికి అందలేదు. ఆందోళన తప్ప ఏమీ కన్పించడం లేదు.
-నర్సారెడ్డి, రైతు, అన్నపురెడ్డిపల్లి
ఈదురుగాలులకు వరి పంట మొత్తం నేలమట్టమైంది. మరికొన్ని రోజుల్లో వరి కోతకు సిద్ధమయ్యాను. సరిగ్గా అదే సమయంలో అకాలవర్షం కురవడంతో పంట నష్టపోవాల్సి వచ్చింది. ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం లేకుంటే అప్పుల్లోంచి బయటపడలేను.
-సీహెచ్.సోమరాజు, రైతు, అన్నపురెడ్డిపల్లి
భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాల్లో ఉద్యాన పంటల నష్టం సర్వే కొనసాగుతోంది. ఈ నెల 7 నుంచి 16 నాటికి 313 మంది రైతులకు చెందిన 470 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు గుర్తించాం. పంట సర్వే పూర్తయిన తర్వాత నివేదికను కలెక్టర్కు అందజేస్తాం.
– జంగా కిశోర్, జిల్లా ఉద్యానాధికారి, భద్రాద్రి