ఒకపక్క కళ్లెదుట ఎన్ఎస్పీ కాలువ నిండా నీరు పారుతున్నా.. మరోపక్క తమ పంటలు ఎండిపోతుండడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెనుబల్లి మండలంలోని తాళ్లపెంట ఎత్తిపోతల పథకం(టీఎస్ఐడీసీ) కింద పంటలు పండించుకుంటున్న రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. గత ఎండాకాలంలో లిఫ్ట్‌కు సంబంధించి విద్యుత్ సరఫరాకు ఉపయోగించే మూడు ట్రాన్స్ఫార్మర్లలో రాగివైరు చోరీకు గురైంది. విద్యుత్‌శాఖ అధికారులతో కలిసి రైతులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పటినుంచి ఇప్పటివరకు ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటును అటు ప్రభుత్వం గానీ, ఇటు అధికారులు గానీ పట్టించుకోకపోడంతో పంట పొలాలు బీడుభూములుగా మారుతున్నాయి. – పెనుబల్లి, ఆగస్టు 19
1997లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కర్రాలపాడు, తాళ్లపెంట, ఎర్రబంజర గ్రామాలకు కలిపి తాళ్లపెంట ఎత్తిపోతల పథకం పేరున లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేశారు. అప్పట్లో 1,560 ఎకరాలకు మూడు గ్రామాల ఆయకట్టుకు సాల్వ, డాల్వ పంటలకు నీళ్లు అందించేందుకు రూ.48 లక్షల వ్యయంతో శంకుస్థాపన చేశారు.
మళ్లీ ఆయనే 1999లో లిఫ్ట్‌ను ప్రారంభించారు. ఆనాటి నుంచి గత సంవత్సరం వరకు ఎన్ఎస్పీ జలాలు వస్తే తప్పనిసరిగా రెండు పంటలు ఆ మూడు గ్రామాల రైతులకు అందుతాయి. కానీ గత ఎండాకాలంలో లిఫ్ట్‌కు సంబంధించి విద్యుత్ సరఫరాకు ఉపయోగించే మూడు ట్రాన్స్ఫార్మర్లలో రాగివైరు చోరీకు గురైంది. విద్యుత్‌శాఖ అధికారులతో కలిసి స్థానిక రైతులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పటినుంచి ఇప్పటివరకు ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుపై ప్రభుత్వం కానీ, అధికారులు కానీ స్పందించలేదు. వానకాలం సీజన్ వచ్చి కరివేద సాగు చేస్తున్న రైతులు, నాట్లు వేసే రైతులు లిఫ్ట్ మరమ్మతులు చేపడతారు, నీళ్లు వస్తాయి, పంటలు పండుతాయన్న ఆశతో ఆయకట్టు పరిసర ప్రాంతం మొత్తం వరిసాగు చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఆ ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులు చేపట్టకపోవడంతో లిఫ్ట్ ఎదురుగానే వరి పంట పొలాలు బీడులుగా మారుతున్నాయి.
దీంతో రైతన్నలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఉపముఖ్యమంత్రి, ప్రస్తుత వ్యవసాయశాఖ మంత్రి, అప్పటి నీటి పారుదలశాఖ మంత్రి , శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసిన మంత్రి, రెవెన్యూశాఖ మంత్రి, ప్రస్తుతం ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఇరిగేషన్‌శాఖ చైర్మన్ అందరూ ఈ ప్రాంత వాసులై ఉండి పేరు గలిగిన తాళ్లపెంట ఎత్తిపోతల పథకంపై దృష్టి సారించాలని, మూడు వేల ఎకరాల్లో పంట ఎండిపోకుండా కాపాడాలని రైతులు కోరుతున్నారు.
లిఫ్ట్ కింద ఉన్న రైతులందరూ ఎన్ఎస్పీ జలాలపైనే ఆధారపడి అప్పటి మంత్రి తుమ్మల చొరవ చూపి లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు లిఫ్ట్‌కు సంబంధించి విద్యుత్ అంతరాయం ఉండడంతో పంట పొలాలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. రైతులందరూ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా రైతుల మొర ఆలకించాలని కోరుతున్నారు.
– ఆళ్ల రమేష్, కర్రాలపాడు, రైతు
అప్పట్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లిఫ్ట్ ఏర్పాటు చేసి నీళ్లు అందించారు. మంచిగానే ఉంది. కానీ ఇటీవల ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసమవడంతో ఇప్పుడు రైతులు ఇబ్బందులు పడుతున్నాం. నారు పోసిన వారు నీళ్లు పోయారా అన్నట్లుగా రైతులకు లిఫ్ట్ మంజూరు చేసి నీళ్లు అందించిన మంత్రి తుమ్మల కల్పించుకొని మరమ్మతులు చేపడితే మూడు గ్రామాల రైతుల ఆయకట్టు కింద ఉన్న పంటలు పండుతాయి.
– కాకా ప్రసాద్, తాళ్లపెంట, రైతు
జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు స్పందిస్తేనే తాళ్లపెంట లిఫ్ట్ కింద ఉన్న మూడు వేల ఎకరాలు పండుతాయి. లేదంటే పంట పొలాలు సైతం ఎర్రటి బీడుభూములవుతాయి.
– ఆళ్ల రంగారావు, కర్రాలపాడు, యువరైతు
కళ్ల ముందే ఎన్ఎస్పీ కాలువలో నీళ్లు నిండా పారుతున్నాయి. కానీ కాలువ ఒడ్డున ఉన్న పొలాలకు నీళ్లు పెట్టుకునే పరిస్థితి లేకుండా పోయింది. మా బాధలు ఎవరికీ రాకూడదు. లిఫ్ట్ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటివరకు పూర్తిస్థాయిలో నీళ్లు అందాయి. కానీ ఇప్పుడు లిఫ్ట్ వస్తాయో రావో అని తెలియడంతో మూడు గ్రామాల రైతులు తీవ్ర ఆందోళనకు పడుతున్నారు. రైతుల బాధలు తెలిసిన ప్రజాప్రతినిధులు వెంటనే కల్పించుకొని ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులు చేపట్టి రైతులను ఆదుకోవాలి.
– శీలం కృష్ణారెడ్డి, కర్రాలపాడు, రైతు