ఉదయమంతా ఉక్కిరిబిక్కిర చేసిన అధిక ఉష్ణోగ్రత.. సాయంత్రానికి మటుమాయమైంది. అదే సమయంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. సరిగ్గా ఆ వెంటనే ఈదురుగాలులు ఊపందుకున్నాయి. ఆ కాసేపటికే వడగండ్ల వాన మొదలైంది. సుమారు గంట నుంచి మూడు గంటలపాటు విరామం లేకుండా కురిసింది. ఇదీ.. ఉమ్మడి జిల్లాలో ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా చోటుచేసుకున్న వాతావరణ మార్పు.
అప్పటి వరకూ మండిన ఎండకు తల్లడిల్లిపోయిన జిల్లా ప్రజలు.. సాయంత్రం చల్లబడిన వాతావరణాన్ని ఆస్వాదించబోయారు. ఈలోపే గాలిదుమారం ఊపందుకోవడంతో ఉరుకులు పరుగులు పెట్టారు. దమ్మపేట, చండ్రుగొండ, కొత్తగూడెం, రుద్రంపూర్, పాల్వంచల్లో వడగండ్ల వాన కురిసింది. దుమ్ముగూడెంలో తాటిచెట్టుపై పిడుగు పడింది. చుంచుపల్లి, బూర్గంపహాడ్, అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ, దమ్మపేట, సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లిల్లో ఈ అకాల వర్షం కారణంగా వివిధ పంటలు దెబ్బతిన్నాయి.
పెనగడప కొనుగోలు కేంద్రంలో రైతులు ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. అన్నపురెడ్డిపల్లి సహా మరికొన్ని చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. ఇక రఘునాథపాలెం, చండ్రుగొండల్లో సుమారు రెండు సెంటీమీటర్ల పొడవున్న వడగండ్లు కురిశాయి. కాగా, దుమ్ముగూడెం మండలంలో ఆదివారం సాయంత్రం వర్షం తగ్గాక ఆకాశంలో హరివిల్లు ఆవిష్కృతమవడంతో ఆ అపురూప దృశ్యాన్ని స్థానికులు తిలకించి ఫోన్లలో ఫొటోలు తీసుకున్నారు.
– నమస్తే నెట్వర్క్, ఏప్రిల్ 13