ఇల్లెందు, మార్చి 26: ఏజెన్సీ ఆదివాసీ గిరిజన ప్రాంతాలకు గోదావరి నీళ్లు రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం జల దోపిడీకి పాల్పడుతున్నదని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆవునూరి మధు ఆరోపించారు. ఇల్లెందు పట్టణంలోని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తలాపున గోదావరి జలాలను పెట్టుకొని ఏజెన్సీ ప్రాంతవాసులు తాగు, సాగునీటికి ఇబ్బంది పడుతుంటే బాధగా ఉందన్నారు.
గోదావరి జలాల కోసం గత ముఖ్యమంత్రి కేసీఆర్ టేకులపల్లి మండలం రోళ్లపాడులో సీతారామ ప్రాజెక్టు రిజర్వాయర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. దీని ద్వారా భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాలకు తాగు, సాగునీరు అందించాలని, గిరిజన ప్రాంతాలను సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో ప్రారంభించినా.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, జిల్లాలోని ముగ్గురు మంత్రులు ఏజెన్సీ ప్రాంతానికి అన్యాయం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
గోదావరి నీటిని మైదాన ప్రాంతానికి, మిగిలిన నీటిని ఆంధ్రాకు తరలించేందుకు కుట్రలు జరుగుతున్నాయని, దీనిపై పోరాటాలు చేసేందుకు అన్ని పార్టీలు కలిసికట్టుగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో న్యూడెమోక్రసీ నాయకులు తుపాకుల నాగేశ్వరరావు, పొడుగు నరసింహారావు, సారంగపాణి, హర్జ్యా, కల్తీ వెంకటేశ్వర్లు, రాసుద్దీన్, తోడేటి నాగేశ్వరరావు, సూర్ణపాక నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.