మామిళ్లగూడెం, ఏప్రిల్ 25: పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను ట్రాక్ చేయడంలో సహాయపడే సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) పోర్టల్ సేవలపై విస్తృతంగా ప్రచారం చేయాలని పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం నిర్వహించిన నేర సమీక్షలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ భవిష్యత్లో మరిన్ని సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సేవలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయించి ఎవరైనా రైతులను మోసం చేస్తే ఉపేక్షించేది లేదన్నారు. వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడంతో అన్నదాతలకు అండగా ఉంటూ.. నకిలీ దందా కట్టడికి పోలీస్, వ్యవసాయ శాఖ సంయుక్త దాడులు నిర్వహించాలన్నారు.
రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి, జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలో ఈ నెల 30న జిల్లాలోని 21 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్న కానిస్టేబుల్ తుది రాత పరీక్షలకు పటిష్ఠ బందోబస్తు, భద్రత ఏర్పాట్లు చేయాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు. దేశంలో అత్యుత్తమమైన పోలీస్స్టేషన్ల జాబితాలో స్థానం పొందిన మధిర రూరల్, వీఎం బంజర ఠాణాల పనితీరును ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలన్నారు. నేరాల నియంత్రణకు విజబుల్ పోలీసింగ్తోపాటు నిరంతరం తనిఖీలు చేపట్టాలన్నారు. సైబర్ నేరాలు, లోన్ యాప్ మోసాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సీపీ సూచించారు. ఇలాంటి వాటి పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.