ఖమ్మం వ్యవసాయం, అక్టోబర్ 29 : ఖమ్మం వ్యవసాయ మార్కెట్ పరిధిలోని పత్తి యార్డుకు రెండో రోజు మంగళవారం సైతం పత్తి పోటెత్తింది. జిల్లా రైతాంగంతోపాటు పొరుగున ఉన్న భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల నుంచి రైతులు సుమారు 20 వేల బస్తాల వరకు తరలించారు. దీనికితోడు సోమవారం తరలించిన పత్తి క్రయవిక్రయాలకు నోచుకోకపోవడం.. ఆ పంట సైతం యార్డులోనే ఉండడంతో ఎటు చూసినా తెల్లబంగారమే దర్శనమిచ్చింది. ఉదయం 10 గంటల సమయంలో జరిగిన ఆన్లైన్ బిడ్డింగ్‌లో క్వింటా గరిష్ట ధర రూ.6,800 పలుకగా.. కనిష్ఠ ధర రూ.6 వేలు, మధ్య ధర రూ.6,600 చొప్పున పత్తి ఖరీదుదారులు పంటను కొనుగోలు చేశారు. అయితే గురువారం నుంచి మార్కెట్‌కు నాలుగు రోజులు సెలవులు ప్రకటించడం, దీపావళి పండుగ కావడంతో పత్తితీత కూలీలు తమ కూలి డబ్బులు డిమాండ్ చేయడం.. నాలుగు రోజుల తర్వాత ధర తగ్గే అవకాశం ఉన్నదని అడ్తీ వ్యాపారులు పదే పదే రైతులకు ఫోన్లు చేయడం వంటి పరిణామ క్రమాల్లో సరుకును భారీగా విక్రయానికి తరలించినట్లు తెలుస్తున్నది. అంతేకాక గ్రామాల్లో పత్తి కొనుగోళ్లు జరుగుతుండడంతో ఇంటి వద్ద అమ్ముకుంటే మంచి ధర రాదనే ఉద్దేశంతో రైతులు మార్కెట్‌కు తరలించి విక్రయిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సీసీఐ కేంద్రాలకు వెళ్లాల్సిన పత్తి వాహనాలు ప్రైవేట్ వ్యాపారుల వద్దకు వెళ్తుండడం ఆశ్చర్యానికి గురి చేస్తున్నది.
గత ఏడాది ఇదే రోజుల్లో ఓ వెలుగు వెలిగిన తేజా రకం ఏసీ మిర్చి ధర ఈ ఏడాది వరుసగా పతనమవుతూ నేలచూపులు చూస్తున్నది. పంట సీజన్లో అమ్ముకుంటే ఆశించిన ధర రాదనే ఉద్దేశంతో క్వింటా ధర రూ.20 వేలు పలికినా చాలా మంది రైతులు, కొందరు వ్యాపారులు కోల్డ్ స్టోరేజీలలో నిల్వ చేశారు. ఆ తర్వాత పంట ధరపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా.. నెల రోజులుగా తగ్గుతూ రూ.19 వేల దిగువకు చేరింది. మంగళవారం జరిగిన జెండాపాటలో ఏసీ రకం క్వింటా గరిష్ఠ ధర రూ.18,700 పలుకగా, కనిష్ఠంగా రూ.10 వేలు మాత్రమే పలికింది. దీంతో ఇంతకాలం పంటను దాచుకున్న రైతుల ఆశలు ఆవిరయ్యాయి. సాధారణంగా కొత్త పంట వచ్చే వేళ పెరగాల్సిన ఏసీ రకం మిర్చి ధరలు అమాంతంగా తగ్గుతుండడంతో అటు రైతులు, ఇటు కొందరు వ్యాపారులు దిగాలు పడుతున్నారు.
ఖమ్మం వ్యవసాయం, అక్టోబర్ 29: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు ఈ నెల 31వ తేదీ నుంచి వరుసగా నాలుగు రోజులపాటు సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం దీపావళి పర్వదినం, ఒకటో తేదీ అమావాస్య, 2వ తేదీ శనివారం, 3వ తేదీ ఆదివారం వారాంతపు సెలవు కావడంతో క్రయవిక్రయాలు ఉండవని పేర్కొన్నారు. సోమవారం నుంచి మార్కెట్లో క్రయవిక్రయాలు యథావిథిగా కొనసాగుతాయని, రైతులు ఈ విషయాన్ని గ్రహించి సెలవులు రోజుల్లో మార్కెట్‌కు సరుకులు తీసుకురావొద్దని కోరారు.