ఖమ్మం/ పాల్వంచ, జూలై 31: అన్ని రంగాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం రూ.26 వేల చొప్పున చెల్లించాలని డిమాండ్ చేస్తూ ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా(టీయూసీఐ) కార్మిక సం ఘం ఆధ్వర్యంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రాల్లో గురువారం ప్రదర్శనలు నిర్వహించారు. తొలుత భద్రాద్రి జిల్లా పాల్వంచలోని నవభారత్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించి అనంతరం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
ఖమ్మం నగరంలోని పెవిలియన్ గ్రౌండ్, మయూరి సెంటర్, బస్టాండ్, వైరా రోడ్ మీదుగా జడ్పీ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయా కార్యక్రమాల్లో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.రామయ్య, భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు ఆర్.మధుసూదన్‌రెడ్డి మాట్లాడారు. కనీస వేతనాల కోసం కార్మిక సంఘాలు పోరాడుతుంటే.. ప్రభుత్వాలు 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి, 282 జీవోను తీసుకొచ్చి పది గంటల పని విధానం అమలు చేయాలని హుకుం జారీ చేస్తున్నారని విమర్శించారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్స్‌ను రద్దు చేసి కార్మికులపై తమకున్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. ఆటో, మోటార్, హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఆటో కార్మికులకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని, సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణను నిలిపివేయాలని కోరారు. అనంతరం ఆర్డీవోకు, డిప్యూ టీ లేబర్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.
ఆయా కార్యక్రమాల్లో సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు ఏ.వెంకన్న, భద్రాద్రి జిల్లా కార్యదర్శి షేక్ యాకూబ్ షావలి, జిల్లా నాయకులు కె.శ్రీనివాస్, ఆవుల అశోక్, పి.రాందాస్, ఈ.శరత్, ఎస్కే.లాల్మియా, నూపా భాస్కర్, గోనెల రమేశ్, గోపాల్‌రావు, కె.పుల్లారావు, ములకలపల్లి లక్ష్మీనారాయణ, గోసు పుల్లయ్య, మధుర, కృష్ణవేణి, బి.రమేశ్, జె.రాంబాబు, గురవయ్య పాల్గొన్నారు.