ఖమ్మం సిటీ, జూన్ 24: ఖమ్మం జిల్లా ప్రభుత్వాసుపత్రి కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికుల సమ్మె రోజురోజుకూ ఉధృతంగా మారుతోంది. కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్య ధోరణి, ముగ్గురు మంత్రుల అలసత్వం, వైద్యాధికారుల మొండితనంతో విసిగి వేసారిన 259 మంది వేతన జీవులు ఆకలి కేకలతో ప్రాంగణాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం కూడా దవాఖాన ఎదుట దీక్షకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చేతిలో చిల్లిగవ్వ లేక ఇంటిల్లిపాది ఆకలితో అలమటిస్తున్నామని, పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు.
ఆ క్రమంలో పారిశుధ్య పనులు నిర్వహించేందుకు మున్సిపల్ కార్మికులు అక్కడికి చేరుకోవడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. తాము కూడా నిరుపేద కార్మికులమేనని, తమకు సహకరించాల్సింది పోయి అధికారులు చెబితే ఎలా వస్తున్నారని నిలదీశారు. సమాచారం అందుకున్న ఖమ్మం టూటౌన్ పోలీసులు ఆసుపత్రికి చేరుకున్నారు. విధులు నిర్వహించేందుకు వచ్చిన వారిని అడ్డుకోవద్దని, మాట వినకపోతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో తీవ్ర అసహనం వ్యక్తం చేసిన కార్మికులు.. తమ గోడు ఆలకించాలని చేతులెత్తి మొక్కారు. అరెస్టులకైనా వెనుకాడేది లేదంటూ వాగ్వాదానికి దిగారు. చేసేదేమీ లేక మున్సిపల్ కార్మికులు, పోలీసులు అక్కడి నుంచి వెనుదిరగడంతో వివాదం సద్దుమణిగింది.
కాంగ్రెస్ పాలనలోనే సమస్యలు..
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత వరకు ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులు మొత్తానికి నెలనెలా వేతనాలు వచ్చేవని సీఐటీయూ నాయకుడు టీ.విష్ణువర్ధన్, టీయూసీఐ నాయకుడు గండమాల రామయ్య అన్నారు. ఆనాడు 575 బెడ్లకు సరిపడా నిధులు మంజూరు చేశారని చెప్పారు. కానీ.. కాంగ్రెస్ సర్కారు హయాంలో ఈ దవాఖాన డీఎంఈ పరిధిలోకి వెళ్లడం, కేవలం 475 బెడ్లకే నిధులు చెల్లిస్తుండడం వంటి కారణాలతో వేతన సమస్య నెలకొందని వివరించారు. ఏడాదిన్నరగా ఈ విషయాన్ని జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులకు, డీఎంఈకి తెలియజేసినా ఎటువంటి ప్రయోజనమూ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిసారీ ధర్నాకు దిగితే తప్ప జీతాలు ఇవ్వని పరిస్థితి తలెత్తుతోందని అన్నారు. అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టి మంత్రుల ఇళ్లను, పర్యటనలను అడ్డుకుంటామని కార్మికులు హెచ్చరించారు.
దవాఖాననా? డంపింగ్ యార్డా?
గత ప్రభుత్వంలోని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో నాణ్యమైన వైద్యవలందించిన ఖమ్మం పెద్దాసుపత్రి పరిస్థితి ప్రస్తుతం దిగజారిపోతోంది. నెలల తరబడి వేతనాలు చెల్లించని కారణంగా కార్మికులు సమ్మెకు దిగిన నేపథ్యంలో వార్డుల్లో వ్యర్థాలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. జనరల్ వైద్యసేవలతోపాటు ప్రసవాల కోసం వస్తున్న వారంతా అక్కడి వాతావరణం చూసి ‘ఇది దవాఖాననా? లేక డంపింగ్ యార్డా?’ అంటూ అసహ్యించుకుంటున్నారు. అక్కడ వెలువడుతున్న కంపు వాసన తట్టుకోలేక ముక్కులు మూసుకుంటూ ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తున్నారు. ఇన్పేషెంట్లుగా చేరిన వారికి కనీసం మంచినీళ్లు ఇచ్చే నాథుడు కూడా లేడు.