పాల్వంచ, మార్చి 2 : రోజురోజుకూ అంతరించిపోతున్న అడవులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని జిల్లా అటవీ శాఖ అధికారి కిష్టాగౌడ్ అన్నారు. శనివారం నేషనల్ గ్రీన్ కార్ప్స్ ఆధ్వర్యంలో కిన్నెరసాని వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన మూడు రోజుల నేచర్ క్యాంపునకు యానంబైలు, పునుకుల, కరకవాగు, పాల్వంచ, కొమ్ముగూడెం పాఠశాలలకు చెందిన 50 మంది విద్యార్థులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా క్యాంపును సందర్శించిన కిష్టాగౌడ్ మాట్లాడుతూ అడవుల సంరక్షణలో కేవలం అటవీ శాఖ ఉద్యోగులే బాధ్యులు కారని, ప్రజలందరూ పాలుపంచుకున్నప్పుడే అడవులను కాపాడుకోవచ్చన్నారు. చిన్నతనం నుంచే విద్యార్థులకు అడవుల సంరక్షణ, అడవుల వల్ల కలిగే లాభాల గురించి అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో వైల్డ్ లైఫ్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్, అశ్వారావుపేట ఎఫ్ఆర్వో కరుణాకరాచారి, జిల్లా నేషనల్ గ్రీన్ కార్ప్స్ కో ఆర్డినేటర్, డీఎస్వో చలపతిరాజు, ఎన్జీసీ రాష్ట్ర ప్రతినిధి రాజశేఖర్, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.