ఖమ్మం రూరల్, మార్చి 4: ‘కొండనాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక ఊడిపోయినట్లు’గా ఉంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఆవేదన. వారిని అలా నయవంచనకు గురి చేసింది రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం. దీంతో ‘నమ్మి కూల్చుకుంటే.. నట్టేట ముంచింది..’ అంటూ లబోదిబోమంటున్నారు ఇళ్ల లబ్ధిదారులు. ‘మీకు ఇల్లు మంజూరైంది. వీలైనంత తొందరగా పాత ఇంటిని కూల్చండి. మేము వచ్చి ముగ్గు పోస్తాం.’ అంటూ అధికారులు హడావిడి చేశారు. ఇల్లు మంజూరైందనుకుంటూ లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు.
తట్టాబుట్టా సర్దుకొని దూరాభారాన ఉన్న అద్దె ఇళ్లలోకి మారారు. వెంటనే వచ్చి తమ చిన్నపాటి గుడిసెలకు, పాత రేకుల ఇళ్లను కూల్చివేశారు. వారాలు, నెలలు గడిచినా అధికారులు రాలేదు. ముగ్గులు పోయలేదు. దీంతో కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరిగి ఎట్టకేలకు అధికారులను కలిశారు. ‘మీరు చెప్పినట్లుగా ఇల్లు కూల్చాం సారూ.. మీరు వచ్చి ముగ్గుపోయడమే తరువాయి..’ అంటూ చెప్పారు.
‘మీ పేరు జాబితాలో లేదు.’ అని ఒకరికి, తాజా జాబితాలో మీ పేరు రాలేదు. మొదటి జాబితా ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాక మీ ఇంటికి ముగ్గు పోస్తాం.’ అంటూ మరొకరికి, ‘మీ పేరు మూడో జాబితాలో ఉంది. దాని నిర్మాణం ఇప్పట్లో కాదు..’ అంటూ ఇంకొకరికి సమాధానాలు చెప్పారు అక్కడి అధికారులు. దీంతో ఎంతో ఆశతో వెళ్లిన లబ్ధిదారులకు ఆవేదనే మిగిలింది. దీంతో ‘కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి ఉన్న ఇల్లు కూల్చుకుంటే.. చివరికి నట్టేట ముంచింది..’ అని తలబాదుకుంటూ వెనుదిరిగారు.
‘మా గ్రామం పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైందని ప్రకటించి, అధికారిక వేదికల మీద సాక్షాత్తూ ప్రజాప్రతినిధులతో ఇళ్ల మంజూరు పత్రాలు అందించిన ప్రభుత్వం మమ్ములను నయవంచనకు గురిచేసింది’ అంటూ మండిపడుతున్నారు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు. పాత ఇళ్లు తొలగించుకుంటే ముగ్గుపోస్తామని, వెంటనే నిర్మాణం మొదలుపెడితే మొదటి విడత సాయాన్ని జమచేస్తామని హడావిడి చేసిన పాలకులు తమకు తీరని ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కారు ఇచ్చే ఇందిరమ్మ ఇంటిని కట్టుకుందామని, గృహ ప్రవేశం కాగానే పిల్లల పెళ్లిళ్లు చేద్దామని తాము కన్న కలలను కాంగ్రెస్ ప్రభుత్వం కల్లలు చేసిందని నెత్తీనోరూ బాదుకుంటున్నారు.
పైలట్ గ్రామంలో లబ్ధిదారుల కుదింపు..
ఖమ్మం రూరల్ మండలంలోని పైలట్ గ్రామమైన ఆరెంపులలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను రేవంత్రెడ్డి ప్రభుత్వం నయవంచనకు గురిచేసింది. ఎన్నికల హామీ అయిన ఆరు గ్యారెంటీల్లోని నాలుగు పథకాల అమలు కోసం రేవంత్ ప్రభుత్వం.. ఆరెంపుల గ్రామాన్ని జనవరి 25న ప్రకటించింది. మరుసటి రోజైన 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక గ్రామసభ ఏర్పాటు చేసింది. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల కోసం అప్పటికే ఆ గ్రామంలో రెండు దఫాలుగా మొత్తం 950 దరఖాస్తులు స్వీకరించింది. వాటన్నింటినీ వడపోసి అర్హులను గుర్తించింది.
అదే గ్రామసభలో లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి మంజూరు పత్రాలు కూడా అందజేసింది. ఆ తరువాత అఖిలపక్ష నాయకులు, అధికారులు కలిసి ఉమ్మడి సమావేశం నిర్వహించారు. 157 మందితో కూడిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేశారు. కానీ.. ఆ తరువాత 43 మందిని తగ్గించి 114 మందితో తుది జాబితా ఖరారు చేశారు.
అయినప్పటికీ మంజూరు పత్రాలు అందుకున్న లబ్ధిదారులందరికీ అధికారుల ద్వారా ప్రభుత్వం కబురు పంపింది. త్వరగా స్థలాలు సిద్ధం చేసుకుంటే ముగ్గులు పోస్తామని, నిర్మాణాన్ని ప్రారంభిస్తే మొదటి విడతగా రూ.లక్ష సాయాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామని హడావిడి చేసింది. దీంతో ప్రభుత్వ మాటలను నమ్మి ఇళ్లు కూల్చుకున్న లబ్ధిదారులకు ఆక్రందన మిగిల్చింది. మొదట గ్రామసభల సాక్షిగా మంజూరు పత్రాలు ఇచ్చినప్పటికీ.. తరువాత జాబితాల్లో పేర్లు లేవంటూ ద్రోహం తలపెట్టింది.
కార్యదర్శికి బాధిత లబ్ధిదారుల వినతి
మంజూరు పత్రాలు అందించిన తమకు కొర్రీలు పెట్టకుండా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలంటూ బాధిత లబ్ధిదారులు వేడుకుటుంటున్నారు. ఈ మేరకు వారంతా కలిసి సోమవారం వెళ్లి పంచాయతీ కార్యదర్శిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎల్-1, ఎల్-2, ఎల్-3 జాబితాలతో నిరుపేదలమైన తమను వెనక్కు నెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మాటలు విని ఉన్న ఇళ్లను కూల్చుకున్న తమను న్యాయం చేయాలని వేడుకున్నారు.
ఇల్లు కూలగొట్టుకున్నాక పేరు లేదంటున్నారు..
‘మీకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. మీరు ఎంత తొందరగా పాత ఇంటిని తీసేస్తే మేం అంత తొందరగా వచ్చి ముగ్గు పోస్తాం’ అంటూ అధికారులు చెప్పారు. దీంతో నేను, నా భర్త కలిసి మా పాత రేకుల ఇంటిని కూల్చివేశాం. వారం పదిరోజులు గడిచినా అధికారులు రాలేదు. ముగ్గు పోయలేదు. కార్యాలయానికి వెళ్లి అడిగితే.. ‘మీ పేరు మొదటి జాబితాలో లేదు. మొదటి జాబితా వాళ్ల నిర్మాణాలు పూర్తయ్యాక మీ పేరు వస్తుంది’ అని చెప్పారు. స్వయంగా అధికారులు చెబితేనే ఇల్లు కూల్చుకున్నాం. సామాన్లు తీసుకెళ్లి అద్దె ఇంట్లో ఉంటున్నాం. ఏం చేయాలో అర్థం కావడం లేదు.
-కొప్పుల రాజేశ్వరి, లబ్ధిదారురాలు, ఆరెంపుల
వేదిక మీదకు పిలిచి మంజూరు పత్రం ఇచ్చారు..
జెండావందనం రోజున అధికారులు మా ఊళ్లో మీటింగ్ పెట్టారు. ఇందిరమ్మ ఇళ్లు వచ్చిన వాళ్లకు ఆ మీటింగ్ వేదిక మీద మంజూరు పత్రాలు అందజేశారు. నన్ను కూడా స్వయంగా స్టేజీ మీదకు పిలిచి మరీ మంజూరుపత్రం ఇచ్చారు. అప్పుడు చాలా సంతోషపడ్డా. ఇందిరమ్మ ఇంటిని కట్టుకోబోతున్నామని కలలుగన్నాం. అధికారులు చెప్పగానే అప్పటికప్పుడు మా పాత ఇంటిని కూల్చివేశాం. తొందరగా కట్టుకుంటే పిల్లల పెళ్లిళ్లు కూడా చేయొచ్చని ఆశపడ్డాం. కిరాయి ఇంట్లోకి వెళ్లాం. ఇప్పుడేమో అధికారులు మా పేరు మూడో జాబితాలో ఉందని అంటున్నారు. అది కూడా ఇప్పట్లో రాదని చెబుతున్నారు.
-చిర్రా రాజ్యం, లబ్ధిదారురాలు, ఆరెంపుల