ఇతడి పేరు వెంకట్రావు. పాల్వంచ ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో డైలీవైజ్ వర్కర్‌గా పనిచేస్తున్నాడు. జీతం వస్తేనే ఇల్లు గడిచేది. 2002లో డైలీవైజ్ వర్కర్‌గా చేరిన ఇతడికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత వరకూ ఎలాంటి ఇబ్బందీ కలగలేదు. కానీ, 22 నెల క్రితం ఎప్పుడైతే కాంగ్రెస్ సర్కారు వచ్చిందో.. అప్పుడే అతడికి కష్టాలు మొదలయ్యాయి. రేవంత్ ప్రభుత్వం కొలువుదీరిన కొన్ని నెలలకే ఆశ్రమ పాఠశాలల్లోని డైలీవైజ్ వర్కర్ల కోసం కొత్త జీవోను తీసుకొచ్చారు.
దాని ప్రకారం వారి వేతనాల్లో భారీగా కోత పెట్టారు. అందులో భాగంగానే వెంకట్రావు వేతనాన్ని కూడా సగానికి కంటే ఎక్కువగా తగ్గించారు. మొన్నటి వరకూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వెంకట్రావుకు రూ.26,250 జీతం వచ్చేది. పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కూడా ఉండేది. ఇప్పుడు 64 జీవో అమలు చేస్తూ అతడి జీతాన్ని ఒక్కసారిగా రూ.11,700కు తగ్గించారు.
గత ప్రభుత్వం ఇచ్చినట్లుగా రూ.26,250 నెలవారీ వేతనం ఇవ్వాల్సిందేనని మొరపెట్టుకున్నందుకు రేవంత్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. డైలీవైజ్ వర్కర్లకు నెలలుగా వేతనాలివ్వడమే బంద్ పెట్టింది. వెంకట్రావుకూ అదే పనిచేసింది. దీంతో ఇతడి పిల్లల బీటెక్ చదువులకు, కుటుంబ పోషణకు ఆర్థికంగా సర్దుబాటు చేయలేక అరిగోస పడుతున్నాడు. ఇంటి అద్దె కట్టేందుకు, జబ్బు చేస్తే ఆసుపత్రికి వెళ్లేందుకు చేతిలో చిల్లిగవ్వలేక సతమతమవుతున్నాడు.
ఆసుపత్రికి వెళ్లేందుకు కొంత డబ్బు అప్పుగా ఇవ్వండని ఇటీవల ఒకరిని అడిగితే.. ‘లెవ్వు పో’ అన్నాడట. ఆ సమయంలో అతడికి ఎంతో బాధ కలిగిందట. ‘ఎవరి కాళ్లు పట్టుకోమన్నా పట్టుకుంటాను. నాకు పాత జీతం (రూ.26,250 చొప్పున) ఇవ్వండి సారూ..’ అంటూ కన్పించిన అధికారినల్లా, కంటపడిన ప్రజాప్రతినిధినల్లా వేడుకుంటున్నాడతడు. ఇది తన ఒక్కడి సమస్యే కాదని, తనలాంటి వందలాది మంది డైలీవైజ్ వర్కర్ల సమస్య అని బోరుమంటున్నాడు.
భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులూ ఆశ్రమ పాఠశాలల్లోని డైలీవైజ్ వర్కర్లు, ఔట్ సోర్సింగ్ కార్మికులు ఏ ఇబ్బందులూ లేకుండా వారి విధులు వారు నిర్వర్తించుకున్నారు. సంతోషంగానూ బతికారు. కానీ కాంగ్రెస్ పాలకులు రాగానే రోడ్డున పడ్డారు. ఇలాంటి వారు ఒక్కరు కాదు ఇద్దరు.. భద్రాద్రి జిల్లాలో ఏకంగా 501 మంది ఉన్నారు. వీరంతా ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థులకు భోజనం వండి పెడుతూ జీవిస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వీరి జీతాల్లో కోతలు పెట్టడంతో ఇప్పుడు వీరంతా రోడ్డున పడ్డారు. ఆశ్రమ పాఠశాలల్లోని డైలీవైజ్ వర్కర్లుగానే కాదు ఔట్ సోర్సింగ్ కార్మికులనూ రేవంత్ సర్కారు వదల్లేదు. పాత జీవో ప్రకారం రూ.12 వేల చొప్పున రావాల్సిన వీరి నెలవారీ వేతనం కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కొత్త జీవోతో రూ.9,200కు తగ్గింది. పైగా, వీరికి కూడా పది నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వేతనాలు ఇవ్వడం లేదు. దీంతో కుటుంబాలను వెళ్లదీసుకునేందుకు వీరు అప్పులు చేయాల్సి వచ్చింది.
భద్రాద్రి జిల్లాలో 52 ఆశ్రమ పాఠశాలల్లో 413 మంది డైలీవైజ్ వర్కర్లు, 22 పోస్టు మెట్రిక్ హాస్టళ్లలో 88 మంది ఔట్ సోర్సింగ్ కార్మికులు వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. వీరంతా తమ సమస్యల పరిష్కారం కోసం గత నెల 12 నుంచి సమ్మె చేస్తున్నారు. ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో నిరవధిక దీక్షలు కొనసాగిస్తున్నారు.
కనికరించని ఎమ్మెల్యేలు..
ప్రతీ నియోజకవర్గంలో ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న డైలీవైజ్ వర్కర్లు సమ్మెలో భాగంగా ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలను ముట్టడిస్తున్నారు. కానీ ఎమ్మెల్యేలెవరూ వీరి సమస్యలను, వీరి సమ్మెను పెద్దగా పట్టించుకోవడం లేదు. సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెబుతున్నారు తప్ప స్పష్టమైన హామీ ఇచ్చి సమస్య పరిష్కారానికి పూనుకోవడం లేదు. దీంతో ఆయా శాసన సభ్యులపై కూడా కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అన్నం పెట్టే మాకు అన్యాయం చేస్తే ఊరుకోం..
పాఠశాల పిల్లలకు అన్నం వండి పెట్టే మాకు.. ప్రభుత్వం అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోం. పాత విధానం ప్రకారం వేతనాలు ఇచ్చే వరకూ పోరాటం చేస్తాం. తిండి లేకపోయినా మా సమస్యలపై ఉద్యమిస్తాం. పాత వేతనాలు సాధించుకుంటాం. మాలాంటి పేదోళ్లకు ప్రభుత్వం అన్యాయం చేయాలని చూస్తోంది.
కనీసం ఒక్క నాయకుడుగానీ, ఒక్క పాలకుడుగానీ వచ్చి పలకరించలేదు. మా సమస్యను తెలుసుకోలేదు. వాళ్ల అవసరాలకు తగ్గట్టుగా మేం వంటలు చేసి పెట్టాలి. ఎక్కడ ఆటల పోటీలు జరిగినా మా హాస్టళ్లలో మాతోనే భోజనాలు వండిస్తున్నారు. మా వద్ద అన్నం తినని వారు లేరు. పైగా, అలా అన్నం వండి పెట్టిన మాకే.. పాలకులు అన్యాయం చేస్తున్నారు.
-మోకాళ్ల వెంకటమ్మ, ములకలపల్లి
ఈమె పేరు ఊరబెద్ది లక్ష్మి. ఏడాదిలోపలే ఉద్యోగం నుంచి దిగిపోయే వయసు. పాఠశాల పిల్లలకు రోజూ వండిపెట్టడం తప్ప స్వతహాగా పస్తులుండడం ఆమెకు తెలియదు. కానీ ఇప్పుడు ఆమె కూడా పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ‘ఎంతో మంది పిల్లలకు నాచేత్తో అన్నం వండి పెట్టాను. వాళ్లంతా ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారు.
కానీ ఇప్పుడు నాకు ఇలాంటి కష్టం వస్తుందని అనుకోలేదు.’ అంటోంది ఆమె. ములకలపల్లి మండలం కమలాపురం ఆశ్రమ పాఠశాలలో డైలీవైజ్ వర్కరుగా ఆమె పనిచేస్తోంది. ఈమె పిల్లలందరూ వేర్వేరు చోట్ల ఉంటున్నారు. ఆమె మాత్రమే ఇక్కడ ఉండి ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు అన్నం వండి పెడుతోంది. కానీ ఇప్పుడు ఈమె జీతం సగానికిపైగా తగ్గడం, అది కూడా ఆరు నెలలుగా రాకపోవడం వంటి కారణాలతో సతమతమవుతోంది.