– నిషేధిత భూములు కోటి ఎకరాలకు ఎలా పెరిగాయి?
– రైతు రుణమాఫీపై మంత్రి తుమ్మల చర్చకు రావాలి
– పొంగులేటి క్షమాపణ చెప్పి తప్పించుకోలేరు
ఖమ్మం, ఆగస్టు 22 : ప్రజల ఆస్తులను కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, కాంగ్రెస్ పార్టీ అంటేనే కబ్జాలు అనే పరిస్థితి నెలకొన్నదని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. శనివారం ఖమ్మం నగరంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రజల ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత కలిగిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, క్షమాపణలు చెప్పినంత మాత్రాన ప్రజలు ఈ చర్యలను ఎలా సహిస్తారని ప్రశ్నించారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ భూభారతి పేరుతో దోపిడీకి పాల్పడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్షమాపణలు చెప్పి బాధ్యత నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని 22A నిషేధిత భూముల విషయంలో గతంలో 8, 9 లక్షల ఎకరాలుగా ఉన్న భూములు ఇప్పుడు కోటి ఎకరాలకు ఎలా చేరుకున్నాయో ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రైతు రుణమాఫీ వంద శాతం పూర్తయిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెబుతున్నారని, అది నిజమని నిరూపించేందుకు ఏ గ్రామానికైనా వచ్చి రైతు రుణమాఫీపై బహిరంగ చర్చకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. తన అంతు చూస్తానని మంత్రి వ్యాఖ్యలు చేస్తున్నారని, అయితే ముందుగా ప్రజల సమస్యలను పట్టించుకునే పరిస్థితిలో ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. ఖమ్మం జిల్లాలో ఎల్ నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో నీటి కొరత, సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉన్నప్పటికీ కనీసం ముగ్గురు మంత్రులు ఈ అంశంపై దృష్టి సారించడం లేదని విమర్శించారు. సీతారామ ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని ఆరోపించారు. రాజీవ్ సాగర్ నిర్మాణం పూర్తయిన ఏడాదికే లైనింగ్ కూలిపోయిందని, దీనిపై ప్రభుత్వం బాధ్యత వహించి ప్రజలకు సమాధానం చెప్పాలని ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో అలవికాని హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని పూర్తిస్థాయిలో నెరవేర్చలేదని మండిపడ్డారు. పేదల ఇళ్లను కూల్చివేస్తూ ప్రభుత్వం పెడబొబ్బలు పెడుతోందని, పేదలను ఆదుకునేందుకు కృషి చేయకుండా వారి పొట్ట కొడుతోందని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తాను మంత్రిగా ఉన్న సమయంలో 23 ఎకరాల్లో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసి, కేబినెట్ ఆమోదంతో జీవో జారీ చేయించానని పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. అయితే జర్నలిస్టుల సంక్షేమం కోసం కనీస చర్యలు కూడా చేపట్టకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వారిని మోసం చేస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన విలువైన ఇళ్ల స్థలాలను జర్నలిస్టులకు కేటాయించడంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రజల ఆస్తులు, రైతుల సమస్యలు, పేదల ఇళ్లు, జర్నలిస్టుల సంక్షేమం వంటి అంశాలపై ప్రభుత్వం తక్షణమే స్పష్టమైన సమాధానం ఇవ్వాలని పువ్వాడ అజయ్ కుమార్ డిమాండ్ చేశారు.