కాంగ్రెస్ సర్కార్ సన్నవడ్లపై రైతులకు ఇవ్వాల్సిన బోనస్‌ను మరిచింది. యాసంగి సీజన్ పూర్తయి నెలలు గడుస్తున్నా.. అన్నదాతలకు ఇస్తామన్న బోనస్ డబ్బుల ఊసే ఎత్తడం లేదు. ఎప్పుడిస్తామనే స్పష్టత కూడా లేకపోవడంతో రైతన్నలు కళ్లల్లో ఒత్తులేసుకొని ఆశగా ఎదురుచూస్తున్నారు. రైతులు పండించిన ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్.. అధికారంలోకి రాగానే సన్నవడ్లకే అంటూ మాటమార్చింది. తీరా రైతులు వడ్లను అమ్ముకొని బోనస్ కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి దాపురించింది. బోనస్ డబ్బుల విషయమై అధికారులను అడిగినా సరైన సమాధానం లేకుండాపోతోంది. – ఖమ్మం, జూలై 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
“బహిరంగ మార్కెట్లో దళారులకు అమ్ముకున్నా ఇప్పటికే డబ్బులొచ్చేవి.. కాంగ్రెస్ సర్కార్ సన్నవడ్లకు బోనస్ ఇస్తామంటే నమ్మి మోసపోయాం.. ఇప్పుడు గోస పడుతున్నాం.. యాసంగి పంట సన్నవడ్ల డబ్బులు వానకాలం వచ్చినా చేతికి రాకపాయె.. ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన హామీనే కాంగ్రెస్ సర్కార్ అమలు చేయలేకపోతున్నది.. సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా ‘బోనస్’ డబ్బుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి దాపురించింది..” ఇది ప్రభుత్వం ఏర్పాటు చేసిన యాసంగి కొనుగోలు కేంద్రాల్లో సన్నవడ్లను అమ్ముకున్న అన్నదాతల మనోవేదన. బోనస్ డబ్బులు వస్తే వానకాలం ఖర్చులకు అక్కెర వస్తాయన్న ఆలోచనతో ఉన్న రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం మొండి‘చేయి’ చూపిస్తున్నది.
ఖమ్మం జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లు ముగిసినా డబ్బులు ఖాతాల్లో జమకాక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పిన ఏ హామీ కచ్చితంగా అమలుకావడం లేదనే విమర్శలు అన్నదాతల నుంచి వినిపిస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా రైతులు యాసంగిలో మొత్తం 72,577 ఎకరాల్లో వరిసాగు చేశారు. ఇందులో 36,560 ఎకరాల్లో సన్నాలు పండించారు.
రైతులు పండించిన సన్నాలను అధికారులు ఐకేపీ, పీఏసీఎస్, మెప్మా, కొనుగోలు కేంద్రాల ద్వారా 9.14 లక్షల క్వింటాళ్లను కొనుగోలు చేశారు. ఇందుకుగానూ ప్రతి క్వింటాకు రూ.500 బోనస్‌గా రైతులకు చెల్లించాల్సి ఉంది. ఈ చొప్పున మొత్తం రూ.45.70 కోట్లు రైతులకు బోనస్ రూపంలో పెండింగ్ ఉంది. అయితే కొనుగోలు చేసిన తక్షణమే బోనస్ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పిన కాంగ్రెసోళ్ల మాటలకు అనుగుణంగా చేతలు ఉండటం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రూ.45.70 కోట్లు పెండింగ్..
సన్నవడ్లకు గానూ క్వింటాకు రూ.500 బోనస్ చెల్లిస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. రైతుల ఖాతాల్లో జమ చేయడంలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నది. ఖమ్మం జిల్లాలో ధాన్యం విక్రయించిన రైతులకు గానూ రూ.45.70 కోట్లు రావాల్సి ఉంది. వానకాలం సీజన్ మొదలై వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్న క్రమంలో బోనస్ కొంత అక్కెరకు వస్తాయనే ఆలోచనలో రైతులు ఉన్నారు. కానీ.. ప్రభుత్వం మాత్రం తాత్సారం చేసుకుంటూ వస్తోంది.
ధాన్యం విక్రయించి రోజులు గడుస్తున్నా అధికారులు బోనస్ విషయమై ఏ మాటాముచ్చట చెప్పకపోవడంతో రైతులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. బోనస్‌పై ప్రభుత్వం నుంచి ఉలుకూ పలుకూ లేకపోవడంతో రైతులు నిరాశకు గురవుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులు ధాన్యం అమ్మిన 48 గంటల్లోనే వారి ఖాతాల్లో జమయ్యేది. కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో 20 రోజులకు గానీ డబ్బులు పడని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక బోనస్ కోసమైతే నెలల తరబడి ఎదురుచూడాల్సిన దుస్థితి. వచ్చినప్పుడే వచ్చినయ్ అనుకోవాల్సిన పరిస్థితి దాపురించింది.
ఖర్చులకు వస్తయనుకున్న..
యాసంగిలో పండిన సన్నవడ్లను ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో అమ్ముకున్నా. నెలలు గడుస్తున్నా బోనస్ డబ్బులు ఇంకా పడలేదు. అధికారులను అడిగితే.. అది ప్రభుత్వ నిర్ణయం మాకు తెలియదంటున్నారు. 48 క్వింటాళ్లకు బోనస్ డబ్బులు రావాలి. పంటను అమ్మిన వెంటనే డబ్బులు అకౌంట్లో వేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మించింది. బోనస్ డబ్బులొస్తే వానకాలం వ్యవసాయ ఖర్చులకైనా ఉపయోగపడతాయని ఎదురుచూస్తున్నాను.
– మేచర్ల నాగేశ్వరరావు, రైతు, వేపకుంట్ల, రఘునాథపాలెం