– జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు
ఎర్రుపాలెం, సెప్టెంబర్ 04 : ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను నమ్మి రాష్ట్రంలోని పసిబిడ్డ నుండి పండు ముసలి వరకు అన్ని వర్గాల ప్రజలు మోసపోయారని బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ ఇన్చార్జి, జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయినా ఎన్నికల హామీల అమలులో స్పష్టత కనిపించడం లేదని ఆరోపించారు.
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం రింగ్ సెంటర్లో మండల కమిటీ ఆధ్వర్యంలో వంటా వార్పు నిర్వహించారు. మండలంలోని పలు గ్రామాల నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లింగాల కమల్‌రాజు హాజరయ్యారు. మాజీ జడ్పీటీసీ శీలం కవిత అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఆయన మాట్లాడారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పుట్టిన బిడ్డకు కేసీఆర్ కిట్ అందించడంతోపాటు ఆడబిడ్డకు రూ.13 వేలు, మగబిడ్డకు రూ.12 వేల చొప్పున నగదు ప్రోత్సాహకం అందించామని కమల్‌రాజు తెలిపారు. తల్లీబిడ్డను ప్రభుత్వ వాహనంలో సురక్షితంగా ఇంటికి చేర్చే విధానం అమలు చేశామని చెప్పారు. అలాంటి పథకాలు ప్రస్తుతం ఏమయ్యాయో కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
పేదింటి ఆడబిడ్డల వివాహాలకు అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేసిందన్నారు. ఒంటరి మహిళలు, వితంతువులకు ఆసరాగా పెన్షన్లు అందించామని తెలిపారు. మహిళల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ అనేక పథకాలను అమలు చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.అలాంటి పథకాలను కోర్ట్ లో కౌంటర్ వేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు.

‘పసిబిడ్డ నుండి పండు ముసలి వరకు మోసం చేసిన కాంగ్రెస్’
ఆరు గ్యారంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని కమల్‌రాజు ఆరోపించారు. మహిళలకు నెలకు రూ.2,500, ఆడబిడ్డలకు తులం బంగారం, వృద్ధులకు రూ.4 వేల పెన్షన్, దివ్యాంగులకు రూ.6 వేల పెన్షన్, విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చారని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు దాటినా హామీల అమలుపై స్పష్టత ఇవ్వడం లేదని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ బాకీ కార్డు గురించి ప్రశ్నించి ప్రభుత్వాన్ని నిలదీయాలని కమల్‌రాజు పిలుపునిచ్చారు. మహిళలకు బకాయి పడిన మొత్తాన్ని వెంటనే వారి ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. హామీలను అమలు చేయకపోతే మహిళలు, ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
వంటా వార్పు కార్యక్రమం అనంతరం లింగాల కమల్‌రాజు మహిళలతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. మహిళలతో కలిసి భోజనం చేస్తూ కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలు, మహిళలతో మమేకమయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ శీలం కవిత, యరమల రేణుక, మండల కార్యదర్శి యన్నం శ్రీనివాసరెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, సర్పంచులు శీలం రామకోటారెడ్డి, వేల్పుల బెంజిమెన్, ఇనపనూరి లాలయ్య, నాయకులు గూడూరు రమణారెడ్డి, శేగిరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి, కుడుముల మల్లికార్జునరెడ్డి, బొర్ర నరసింహారావు, యరమల కృష్ణారెడ్డి, మస్తాన్‌వలి, శ్రీపాలశెట్టి తిరుపతిరావు, షేక్ బాబుసా, బొగ్గుల భాస్కర్‌రెడ్డి, ఉమామహేశ్వరరెడ్డి, కోట శ్రీనివాసరావు, సంక్రాంతి కృష్ణారావు, షేక్ బహదూర్ఖాన్, బాలరాఘవరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, నర్సిరెడ్డి, తోట శ్రీనివాసరావు, గద్దల శ్రీనివాసరావు, సాంబశివరావు, నాగేశ్వరరావు, కాళేశ్వరరావు, రవి, నరేష్, పూర్ణారెడ్డి, రామచంద్రరావు, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.