భద్రాచలం, డిసెంబర్ 14 : నిరుపేదల ఇళ్ల కలను సాకారం చేసేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రతిష్టాత్మకంగా నిర్మించి లబ్ధిదారులకు పంపిణీ చేసింది. ఇంకొన్ని నిర్మాణాలు పూర్తయినా ఎన్నికల కోడ్ రావడంతో.. వాటిని పంపిణీ చేయలేకపోయారు. దీంతో వాటికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రంగులు మార్చి తమ గొప్పగా చెప్పుకునేందుకు తాపత్రయపడుతున్నది.
భద్రాచలం పట్టణంలోని ఏఎంసీ కాలనీలో గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కట్టించిన 118 డబుల్ బెడ్రూం ఇళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం రంగులు మార్చడమే పనిగా పెట్టుకున్నది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఇల్లు కట్టకున్నా.. ఇది తమ ఘనతగా చెప్పుకునేందుకు శనివారం 111 ఇళ్లకు రంగులు వేసి లబ్ధిదారులకు పంపిణీ చేసింది. బీఆర్ఎస్ పాలనలో కట్టించిన ఇళ్లను తమ ఖాతాలో వేసుకునేందుకు రంగులు వేయించి లబ్ధిదారులకు పంపిణీ చేస్తుండడంతో అక్కడి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.