ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్
ఖమ్మం, నవంబర్ 30: సమీకృత కలెక్టరేట్ పనులను ఈనెల 7వ తేదీలోపు పూర్తి చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. బుధవారం ఆయన పనులను పరిశీలించి కాంట్రాక్టర్లు, అధికారులతో మాట్లాడారు. త్వరితగతిన ప్లాంటేషన్ పనులు పూర్తి చేయాలని సూచించారు. వారం రోజుల్లో విద్యుత్‌కు సంబంధించిన పనులు పూర్తి కావాలన్నారు. అంతర్గత రహదారిలో 40 స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయాలన్నారు. పనులను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. కలెక్టర్ వెంట డీఆర్వో శిరీష, ఆర్అండ్బీ ఈఈ శ్యాంప్రసాద్, మున్సిపల్ ఈఈ కృష్ణలాల్ ఉన్నారు.
‘డబుల్’ ఇండ్లను వెంటనే పూర్తి చేయాలి
నగరపాలకస సంస్థ పరిధిలోని అల్లీపురం, వైఎస్సార్ నగర్లో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్ల సముదాయాన్ని సత్వరం పూర్తి చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. బుధవారం ఆయన పనులను పరిశీలించి కాంట్రాక్టర్లతో మాట్లాడారు. పనులు పూర్తి చేస్తే వెంటనే బిల్లులు విడుదల చేయిస్తామన్నారు. పనుల్లో రోజువారీ పురోగతి ఉండాలని సూచించారు. సమస్యలేమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ కమిషన్ ఆదర్శ్ సురభి, డీఆర్వో శిరీష, ఆర్అండ్బీ ఈఈ శ్యాంప్రసాద్, డబుల్ బెడ్ రూం ఇండ్ల డీఈ టి.కృష్ణారెడ్డి ఉన్నారు.
బస్తీ దవాఖాన తనిఖీ
నగర పరిధిలోని వైఎస్సార్ నగర్ బస్తీ దవాఖానను బుధవారం కలెక్టర్ వీపీ గౌతమ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యసేవల కోసం ఆస్పత్రికి వచ్చి వారితో స్వయంగా మాట్లాడారు. ఆస్పత్రిలో అందుతున్న సేవలపై ఆరా తీశారు. పలు రికార్డులను పరిశీలించారు. రోజుకు 40-45 ఓపీ వస్తున్నట్లు వైద్యసిబ్బంది కలెక్టర్‌కు తెలిపారు. గాయాల డ్రెస్సింగ్ కోసం ఎక్కువ మంది దవాఖానకు వస్తున్నారని, అందుకు తగిన సిబ్బందిని నియమించాలని కోరారు. ప్రతి మంగళవారం డయాబెటిక్ డే నిర్వహిస్తున్నామన్నారు.