భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 16 (నమస్తే తెలంగాణ): భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలు ప్రకారం పార్లమెంట్ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ ప్రియాంక సూచించారు. స్థానిక ఐడీవోసీలో శనివారం జరిగిన అధికారుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం విడుదల చేసిందని, ఏప్రిల్ 18న నోటిఫికేషన్ వస్తుందని అన్నారు.
ఏప్రిల్ 18 నుంచి 26 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని, 26 వరకు నామినేషన్ల స్క్రూట్నీ, 29న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని, మే 13న పోలింగ్, జూన్ 4 న కౌంటింగ్ ఉంటాయని వివరించారు. జిల్లాలో 1095 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎస్పీ రోహిత్‌రాజు మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా జిల్లాలో అక్రమ నగదు, లిక్కర్ సరఫరా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కాశయ్య, వివిధ శాఖల అధికారులు వెంకటేశ్వరచారి, రవి, తిరుమలరావు, దారా ప్రసాద్, సుశీల్, నవీన్ పాల్గొన్నారు.