మామిళ్లగూడెం, జనవరి 6 : ప్రజావాణిలో ప్రజలు సమర్పించిన అర్జీలను త్వరగా పరిష్కరించి పెండింగ్ లేకుండా చూడాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. ఖమ్మం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డిలతో కలిసి దరఖాస్తులు స్వీకరించారు.
ఈ సందర్భంగా తల్లాడ మండలం కలకొడిమ గ్రామానికి చెందిన ఆదూరి శిరీష తాను ఎస్సీ కుటుంబానికి చెందిన మహిళను అని, గతంలో ప్రజా పాలనలో ఇందిరమ్మ ఇల్లు కొరకు దరఖాస్తు చేసుకున్నానని, ప్రస్తుత సర్వేలో తన పేరు రాలేదని, తనకు ఇల్లు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకుంది. దీనిపై ఈఈ హౌసింగ్ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లావ్యాప్తంగా పలు గ్రామాలకు చెందిన ప్రజలు తమ తమ సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్కు వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో డీఆర్డీవో సన్యాసయ్య, డీఆర్వో రాజేశ్వరి, కలెక్టరేట్ ఏవో అరుణ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కొత్తగూడెం టౌన్, జనవరి 6 : తమ తమ సమస్యలపై బాధితులు సమర్పించే దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ విద్యాచందన సంబంధిత అధికారులను ఆదేశించారు.
భద్రాద్రి కొత్తగూడెం ఐడీవోసీ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. అన్ని శాఖల అధికారులతో కలిసి వివిధ ప్రాంతాల ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వాటిని సంబంధిత శాఖల అధికారులకు అదనపు కలెక్టర్ ఎండార్స్ చేశారు. కార్యక్రమంలో జిల్లా పరిపాలనాధికారి రమాదేవి, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.