మామిళ్లగూడెం, నవంబర్ 15: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలను పాటిస్తూ గ్రూప్-3 పరీక్షలకు అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ శుక్రవారం ప్రకటనలో సూచించారు. నవంబర్ 17న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు రెండు సెషన్లుగా పరీక్షలు జరుగతాయని తెలిపారు.
నవంబర్ 18న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష ఉంటుందని తెలిపారు. ఖమ్మం జిల్లాలో ఈ పరీక్షలకు 27,984 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని, వారికి అవసరమైన ఏర్పాట్లు పూర్తిచేశామని వివరించారు. అభ్యర్థులు ఉదయం సెషన్‌కు 8:30 లోపు, మధ్యాహ్నం సెషన్‌కు 1:30 లోపు రావాలని, ఉదయం 9:30 గంటలకు, మధ్యాహ్నం 2:30 గంటలకు గేట్లు మూసివేస్తారని, ఆ తరువాత ఎవరినీ లోపలికి అనుమతించరని స్పష్టం చేశారు.