మధిర, ఏప్రిల్ 23 : ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి, కొత్త ఆర్వోఆర్ చట్టంతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, ఆ దిశగా అధికార యంత్రాంగం కృషి చేస్తుందని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. మధిర పట్టణంలోని రిక్రియేషన్ క్లబ్లో భూభారతి, కొత్త ఆర్వోఆర్ చట్టంపై బుధవారం అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అపరిష్కృతంగా ఉన్న సమస్యలు, వివాదాలను తొలగించి పారదర్శకంగా ఉన్న భూ సమస్యలకు భూభారతి చట్టంతో పరిష్కారం లభిస్తుందన్నారు.
భూముల సమాచారం, జీపీఎస్ ప్రక్రియతో మరోసారి సర్వే చేసి పూర్తి సరిహద్దులు నిర్ణయించి భూ యజమాన్యం నిర్ధారిస్తారని పేర్కొన్నారు. తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నారని, ఇక నుంచి అన్ని పత్రాలు పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాతే రిజిస్ట్రేషన్ విధానం ముగుస్తుందన్నారు. భూభారతిలో ఎలాంటి లోపాలున్నా తమ దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరిస్తామన్నారు. భూ సమస్యలపై చేసే దరఖాస్తుల్లోని తప్పులను నివారించడానికి కలెక్టరేట్లో సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
అలాగే ఆర్డీవో, తహల్దార్ కార్యాలయాల్లో సహాయక కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో జీ.నరసింహారావు, అదనపు డీఆర్డీవో నూరుద్దీన్, మార్కెట్ చైర్మన్ బండారు నరసింహారావు, తహసీల్దార్ రాచబంటి రాంబాబు, ఏడీఏ విజయచంద్ర, మున్సిపల్ కమిషనర్ సంపత్‌కుమార్, ఏవో సాయిదీక్షిత్ తదితరులు పాల్గొన్నారు.