సత్తుపల్లి, ఏప్రిల్ 24 : సాగులో లాభాలు గడించే విధంగా రైతులు యాజమాన్య పద్ధతులు పాటించాలని, ఆ దిశగా వ్యవసాయాధికారులు సూచనలు సలహాలు అందించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. తల్లాడ మండలం కుర్నవల్లి గ్రామంలోని రైతు వేదికలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వైరా కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన రైతు సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు.
గ్రామీణ వ్యవసాయ కృషి అనుభవ కార్యక్రమంలో నాల్గవ సంవత్సరం చదువుతున్న వ్యవసాయ విద్యార్థులు రైతులకు నూతన సాగు విధానంపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను కలెక్టర్ ప్రారంభించారు. విద్యార్థులు రూపొందించిన ప్రదర్శనలను తిలకించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అభివృద్ధి అంటే కేవలం పరిశ్రమలు, ఉత్పత్తి రంగాలు మాత్రమే కాదని, మనమంతా వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చామని, వ్యవసాయాన్ని మరిచిపోతే మన అస్థిత్వం కోల్పోతామన్నారు.
వ్యవసాయ విద్యార్థులు రాబోయే రోజుల్లో రైతులకు మరిన్ని సేవలు అందించాలని, అన్నదాత అభివృద్ధి కోసం అహర్నిషలు కష్టపడాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, రైతులు తమ అనుభవాలను పంచుకున్నారు. శాస్త్రవేత్తలు రైతులకు వివిధ పద్ధతులపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కేవీకే వైరా ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ కే.రవికుమార్, జిల్లా వ్యవసాయాధికారి డీ.పుల్లయ్య, డాక్టర్ జే.హేమంత్‌కుమార్, శ్రీనివాసరెడ్డి, తల్లాడ తహసీల్దార్ సురేశ్‌కుమార్, వ్యవసాయాధికారి తాజుద్దీన్, విస్తరణాధికారి త్రివేణి, డాక్టర్ మధుసూదన్‌రెడ్డి, డాక్టర్ ఝాన్సీ, డాక్టర్ శ్రవణ్, శాస్త్రవేత్త ఫణిశ్రీ తదితరులు పాల్గొన్నారు.