మామిళ్లగూడెం, నవంబర్ 28: జిల్లాలో మత్తు పదార్థాల నియంత్రణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, దీనిపై అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో గురువారం అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ నియంత్రణపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న మూడు నెలలపాటు డ్రగ్స్, మాదక ద్రవ్యాల నియంత్రణ, వీటి వల్ల కలిగే దుష్పరిణామాలపై పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టాలన్నారు. ప్రతీ మండలంలో బృందాలుగా ఏర్పడి వారానికి రెండు విద్యా సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జిల్లా కేంద్రంలో డీ-అడిక్షన్ సెంటర్ ఏర్పాటుకు అనువైన భవనం గుర్తించాలన్నారు.
మత్తు పదార్ధాలకు బానిసలుగా మారిన వారిని గుర్తించి చికిత్స అందించే బాధ్యతను స్వచ్ఛంద సంస్థలకు అప్పగించేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. అలాగే ప్రతీ ఉన్నత పాఠశాలలో స్పోకెన్ ఇంగ్లిష్‌కు అరగంట, క్రీడలకు అరగంట షెడ్యూల్ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని డీఈవోను ఆదేశించారు. సమావేశంలో డీఈవో సోమశేఖర శర్మ, సంక్షేమాధికారి రాంగోపాల్‌రెడ్డి, షేర్ ఎన్జీవో డైరెక్టర్ గోపాల్‌రెడ్డి, కౌన్సిలర్లు గోపాల్‌స్వామి, హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు.