ఖమ్మం రూరల్, అక్టోబర్ 9 : జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ఈ నెల 11న జరిగే సమీకృత గురుకుల పాఠశాలల భవన నిర్మాణ సముదాయ శంకుస్థాపన కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి, ఇద్దరు మంత్రులు హాజరవుతున్నందున పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పొన్నెకల్ గ్రామం వద్ద నిర్మించనున్న సమీకృత రెసిడెన్షియల్ పాఠశాలల సముదాయానికి స్థలం, మంత్రుల పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ బుధవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక సమీకృత రెసిడెన్షియల్ పాఠశాల నిర్మించేలా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. తొలివిడతలో పాలేరు, ఖమ్మం, మధిర నియోజకవర్గాల్లో ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో భాగంగా 11న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు హాజరై శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.
ఉదయం 9 గంటలకు పొన్నెకల్, 11 గంటలకు మధిర నియోజకవర్గంలోని బోనకల్ మండలం లక్ష్మీపురం, మధ్యాహ్నం 2 గంటలకు ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలంలోని జింకలతండా వద్ద శంకుస్థాపన కార్యక్రమాలు ఉంటాయన్నారు. సభా వేదిక, ప్రజలకు సరిపడా కుర్చీలు, పైలాన్, తాగునీరు తదితర ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్ఠ, హేమలత, డీఈవో సోమశేఖర శర్మ, తహసీల్దార్ రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.