భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను అందించే ఆయిల్‌పామ్ సాగుపై రైతులు దృష్టి సారించాలని, ఆ దిశగా రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. ఐడీవోసీ కార్యాలయ సమావేశ మందిరంలో ఆయిల్‌పామ్ సాగుపై రైతులకు గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ప్రస్తుతానికి 23 మండలాల్లో 21,329 మంది రైతులు, 83,850 ఎకరాల్లో ఆయిల్‌పామ్ పంట సాగు చేస్తున్నారని తెలిపారు.
2025-26 ఆర్థిక సంవత్సరానికి 14,500 ఎకరాల లక్ష్యంతో 8,163 ఎకరాల లక్ష్యాన్ని సాధించామని వివరించారు. 21 పీఏసీఎస్‌లలోని ప్రతీ సంఘం పరిధిలో కనీసం వంద ఎకరాల ఆయిల్‌పామ్ సాగు లక్ష్యాన్ని ఏపీసీ నిర్ణయించారని తెలిపారు. రైతులు శాశ్వత ఆదాయం కోసం ఆయిల్‌పామ్ సాగుపై దృష్టి మళ్లించాలన్నారు. జిల్లాలో సుమారు 80 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తున్నారని, అందులో కనీసం పది వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు ప్రారంభించేలా రైతులను ప్రోత్సహించాలని సూచించారు. సదస్సులో జిల్లా ఉద్యాన అధికారి కిశోర్, వ్యవసాయ అధికారి బాబూరావు, సహకార శాఖ అధికారి శ్రీనివాస్, గోద్రేజ్ ప్రైవేట్ లిమిటెడ్ జిల్లా ఇన్చార్జి రామకృష్ణ, జిల్లా ఉద్యాన, వ్యవసాయ శాఖలు, పీఏసీఎస్‌లు, తెలంగాణ ఆయిల్ ఫెడ్, గోద్రేజ్ సంస్థల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.