భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ) : గ్రామాభివృద్ధిలో సర్పంచుల పాత్ర అత్యంత కీలకమని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు జిల్లా కేంద్రంలోని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో రెండో విడత శిక్షణా తరగతులను కలెక్టర్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 471 పంచాయతీల సర్పంచ్‌లకు విడతల వారీగా శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 17 నుంచి 21వ తేదీ వరకు శిక్షణ ఉంటుందని చెప్పారు.
రెండో విడతలో అశ్వారావుపేట, దమ్మపేట, దుమ్ముగూడెం, ములకలపల్లి, జూలూరుపాడు, టేకులపల్లి, ఇల్లెందు, లక్ష్మీదేవిపల్లి మండలాలకు చెందిన 233 మంది నూతన సర్పంచ్‌లకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. పంచాయతీరాజ్ చట్టం, గ్రామాభివృద్ధి కార్యక్రమాల అమలు విధానం, ఆర్థిక నిర్వహణ, సామాజిక బాధ్యతలు, పారదర్శక పాలన అంశాలపై సవివరంగా మార్గనిర్దేశం చేయనున్నట్లు తెలిపారు.
సర్పంచ్‌లు గ్రామంలో జరుగుతున్న ప్రతీ అభివృద్ధి కార్యక్రమంలో అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని సూచించారు. జడ్పీ సీఈవో నాగలక్ష్మి, డీపీవో సుధీర్, శిక్షణ డీపీవో అనూష, డీఎల్పీవోలు ప్రభాకర్, రమణ, టీజీఐఆర్టీ సెంటర్ హెడ్ సుభాష్‌చంద్ర గౌడ్, ట్రైనర్లు బన్సింగ్, రవీందర్‌రెడ్డి, సునీల్‌కుమార్, ముత్యాలరావు, హజ్రత్ వలీ, ఏపీవో రంగ, ఎస్బీఎం రేవతి, డీటీఎం సందీప్, అరుణ్‌కుమార్ పాల్గొన్నారు.