కూసుమంచి, ఆగస్టు 22 : నీటి గుంతల నిర్మాణంతోనే భూగర్భ జలాలు పెరుగుతాయని, వీటి నిర్మాణం ఒక యజ్ఞంలా సాగాలని కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. కూసుమంచిలోని పల్లపు ప్రాంతంలో వర్షపు నీటి నిల్వ కోసం రైతు అర్వపల్లి వెంకటేశ్వర్లు తీసిన ఫాం పాండ్‌ను కలెక్టర్ శనివారం పరిశీలించి, రైతును అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ రైతు ఇలా ఆలోచించి ఆచరణలో పెడితే పక్కనే ఉన్న బోరు బావుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుందన్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు వర్షపు నీటి నిల్వ కోసం తీసిన గుంతలు ఎంతో ఉపయోగపడతాయన్నారు.
ఫాం పాండ్స్ నిర్మాణాలపై రైతులకు, ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. నీటి నిల్వల వల్ల జరిగే లాభాల గురించి తెలియజేస్తే రైతులు ముందుకొస్తారని, వీటి నిర్మాణంతో భూమి తగ్గుతుందని భావించడం ఒక అపోహ మత్రమేనన్నారు. ఫాం పాండ్స్‌లో చేపలు, రొయ్యలు కూడా పెంచుకోవచ్చని, వ్యవసాయానికి అనుబంధంగా అదనపు ఆదాయం కూడా రైతులకు సమకూరుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో జశ్వంత్‌కుమార్ తహసీల్దార్ సైదులు, ఏవో రామడుగు వాణి, ఏపీవో అప్పారావు, ఈసీ కరుణ, సర్పంచ్ కొండా కృష్ణవేణి, పంచాయితీ కార్యదర్శి నీరజ, ఏఈవో జానీబాబా పాల్గొన్నారు.