మామిళ్లగూడెం, అక్టోబర్ 16: జిల్లాలో తిరుమల తరహాలో వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి 20 ఎకరాల స్థలాన్ని గుర్తించామని, స్థలం అప్పగింతకు వెంటనే చర్యలు చేపట్టాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సంబంధిత అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో కలెక్టర్.. దేవాదాయ శాఖ స్థపతి ఎన్.వళ్లినాయగం, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డిలతో కలిసి ఆలయ స్థల విషయమై గురువారం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఖమ్మం అర్బన్ మండలం అల్లీపురం వద్ద 20 ఎకరాల స్థలాన్ని గుర్తించి, ఆలయ నిర్మాణానికి కేటాయించినట్లు తెలిపారు.
ఆలయ నిర్మాణం, విడిది, అన్ని వసతులకు అనువుగా స్థల సేకరణ చేశామన్నారు. వేద పాఠశాల, కల్యాణ మండపం, కళాక్షేత్రం, భజన మందిరం నిర్మాణాలకు ఆగమశాస్త్రం ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రపతి, ప్రధాని, ముఖ్యమంత్రి వంటి ప్రముఖులు సందర్శనకు వచ్చినప్పుడు విడిది, హెలిపాడ్ సౌకర్యాలను కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. సమీక్షలో ఆర్డీవో నర్సింహారావు, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ వీరస్వామి, డీఈ రమేశ్‌బాబు, అర్బన్ తహసీల్దార్ సైదులు తదితరులు పాల్గొన్నారు.